IPL 222: 'కోహ్లి, రోహిత్ త్వ‌ర‌లోనే అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడతారు'

22 Apr, 2022 16:50 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లి వ‌రుస‌గా 114 ప‌రుగులు,119 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. అదే విధంగా రోహిత్ సార‌థ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ప్లేఆఫ్‌ల రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

ఇక కోహ్లి, రోహిత్ ఆట‌తీరుపై అంద‌రూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే.. టీమిండియా మాజీ  క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీరిద్ద‌రికి మ‌ద్ద‌తుగా నిలిచాడు. రోహిత్‌, కోహ్లి త్వ‌ర‌గా ఫామ్‌లోకి రావాల‌ని అత‌డు కోరుకుంటున్నాడు. రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన‌  ఆట‌గాడ‌ని, అతడు ఫామ్‌లోకి వ‌స్తే విధ్వంసం సృష్టిస్తాడ‌ని గవాస్కర్ తెలిపాడు.

"రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడ‌ లేదు. కానీ అత‌డు ఒక్క అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌స్తాడ‌ని భావిస్తున్నాను. అయితే అత‌డు విఫలం కావ‌డం జ‌ట్టుపై  ప్రభావం చూపుతుంది. అత‌డు అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడితే.. ముంబై ఖచ్చితంగా భారీ స్కోర్ సాధిస్తుంది. అత‌డు ఫామ్‌లోకి రావ‌డం ముంబై జ‌ట్టుకు చాలా ముఖ్యం.

ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. అత‌డికి అదృష్టం క‌లిసి రావ‌డం లేదు. చిన్న చిన్న త‌ప్పులు వ‌ల్ల కోహ్లి వికెట్‌ కోల్పోతున్నాడు. ఏదైనా మ్యాచ్‌లో 30 పైగా ప‌రుగులు సాధించిన‌ప్పుడు.. భారీ ఇన్నింగ్స్‌గా మ‌ల‌చడానికి ప్ర‌యత్నించాలి" అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: IPL 2022 CSK Vs MI: అప్పుడూ.. ఇప్పుడూ ధోని వలలో చిక్కిన పొలార్డ్‌! ఇగోకు పోయి బొక్కబోర్లా పడి..

మరిన్ని వార్తలు