‘ఓవర్‌లో రెండు బౌన్సర్లకు అనుమతించాలి’

9 Oct, 2020 06:16 IST|Sakshi

టి20 క్రికెట్‌పై గావస్కర్‌ సూచన

న్యూఢిల్లీ: టి20 క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను ఉన్నపళంగా మార్చాల్సిన అవసరం లేదని, అయితే బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచే చర్యలు మాత్రం తీసుకోవాలని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ఈ ఫార్మాట్‌లో బౌలర్‌కు కూడా కాస్త అనుకూలత ఉండేందుకు ఓవర్‌లో రెండు బౌన్సర్లను అనుమతించాలని ఆయన సూచించారు. ‘టి20 క్రికెట్‌ ఇప్పుడు అన్ని రకాలుగా బాగుంది. అయితే బ్యాట్స్‌మన్‌ ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. కాబట్టి బౌలర్‌ కోసం ఓవర్‌కు రెండు బౌన్సర్లు అనుమతించాలి.

మైదానాల్లో ఉన్న అవకాశాన్ని బట్టి బౌండరీ దూరం కూడా పెంచాలి’ అని సన్నీ చెప్పారు. మరోవైపు నోబాల్‌లను మూడో అంపైర్లు పర్యవేక్షిస్తున్న విధంగానే బంతి వేయక ముందే క్రీజ్‌ దాటి ముందుకు వచ్చే నాన్‌స్ట్రయికర్ల విషయంలో కూడా ఒక కన్నేయాలని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే బ్యాట్స్‌మన్‌ ఖాతాలోంచి ఒక పరుగు తగ్గించాలని వ్యాఖ్యానించిన గావస్కర్‌... గత మ్యాచ్‌లో ఫించ్‌ను అశ్విన్‌ మన్కడింగ్‌ చేయకపోవడాన్ని అభినందించారు. ‘అశ్విన్‌ చాలా తెలివైన క్రికెటర్‌. ఇలా చేయడం ద్వారా అతను జట్టు కోచ్‌ పాంటింగ్‌ మాటకు విలువిచ్చినట్లు, గౌరవించినట్లు అయింది. ఆపై మళ్లీ చేస్తే వదిలిపెట్టనంటూ హెచ్చరిక జారీ చేయడం కూడా చెప్పుకోదగ్గ విషయం’ అని భారత మాజీ కెప్టెన్‌ విశ్లేషించారు. 

మరిన్ని వార్తలు