Ind Vs Ban: టీమిండియా దిగ్గజానికి మాతృ వియోగం.. సంతాపం ప్రకటిస్తూనే.. హ్యాట్సాఫ్‌ చెబుతూ

27 Dec, 2022 08:16 IST|Sakshi

Sunil Gavaskar: టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మినాల్‌ గావస్కర్‌ కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య కారణాల వల్ల 95 ఏళ్ల వయసులో ముంబైలోని నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. కాగా సునిల్‌ గావస్కర్‌ టీమిండియా- బంగ్లాదేశ్‌ రెండో టెస్టుకు ఢాకాలో కామెంటరీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ విషాదకర వార్త తెలిసినప్పటికీ బాధను దిగమింగుకుని ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో తల్లి పోగొట్టుకుని విషాదంలో మునిగిపోయిన గావస్కర్‌కు సంతాపం ప్రకటిస్తూనే.. విధుల పట్ల ఆయన అంకితభావానికి అభిమానులు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

సోదరుడూ క్రికెటరే!
భారత మాజీ వికెట్‌ కీపర్‌, బాంబే క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాధవ్‌ మంత్రి సోదరి మినాల్‌. ఆమెకు మనోహర్‌ గావస్కర్‌తో వివాహం కాగా.. వీరికి ఒక కుమారుడు సునిల్‌ గావస్కర్‌  , ఇద్దరు కుమార్తెలు నూతన్‌, కవిత జన్మించారు.

ఇక స్వతహాగా క్రికెటర్‌ చెల్లెలు అయిన మినాల్‌ తన కుమారుడు సునిల్‌ క్రికెటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కోరుకున్నట్లుగానే టీమిండియా దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించి సునిల్‌ గావస్కర్‌ ఆమెకు గొప్ప బహుమతి అందించారు. కాగా 2012లో ఆమె భర్త మనోహర్‌ గావస్కర్‌ మరణించారు. 

చదవండి: Suryakumar Yadav: సీక్రెట్‌ రివీల్‌ చేసిన సూర్యకుమార్‌.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్‌ నుంచి మారిన తర్వాతే
ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా

>
మరిన్ని వార్తలు