'ఆ మ్యాచ్‌లో నన్ను‌ గెట్‌ అవుట్‌ అన్నారు'

1 Jan, 2021 12:48 IST|Sakshi

మెల్‌బోర్న్‌ :  టీమిండియా మాజీ ఆటగాడు.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్ ఆసీస్‌ ఆటగాళ్లతో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తాను అవుట్‌ కాకున్నా అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడని.. వెంటనే ఆసీస్‌ ఆటగాళ్లు తన వద్దకు వచ్చి గెట్‌ అవుట్‌ అంటూ సింబల్‌ చూపించారని గవాస్కర్‌ తెలిపాడు.1981లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ డేమియన్‌ ప్లెమింగ్‌తో జరిగిన సంభాషణలో గవాస్కర్‌ ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు.

అసలు విషయంలోకి వెళితే..  ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్‌ డెన్నీస్‌ లిల్లీ వేసిన బంతి గవాస్కర్‌ బ్యాట్‌ను తాకి ఆపై ప్యాడ్లను తాకింది. ఆసీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగానే అంపైర్‌ వెంటనే అవుట్‌ ఇచ్చాడు. అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవాస్కర్‌ పిచ్‌ను వీడలేదు. డెన్నీస్‌ లిల్లీ సహా ఇతర ఆటగాళ్లు గవాస్కర్‌ వద్దకు వచ్చి అంపైర్‌ అవుటిచ్చాడు.. గెట్‌ అవుట్‌ మ్యాన్‌ అంటూ కామెంట్‌ చేశారు. (చదవండి : ఆ క్యాప్‌ ధరించడం ఇష్టం లేదు : స్టోక్స్‌)

దీంతో కోపంతో ఊగిపోయిన గవాస్కర్‌ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న చేతన్‌ చౌహన్‌ను తీసుకొని మైదానం వీడే ప్రయత్నం చేశాడు. ఈ చర్యతో ఆసీస్‌ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరు కలిసి పెవిలియన్‌కు చేరుకుంటుండగా భారత మేనేజర్‌ కిందకు వచ్చి గవాస్కర్‌కు సర్ధి చెప్పి చేతన్‌ చౌహన్‌ను వెనక్కి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఎప్పుడు కూల్‌గా కనిపించే గవాస్కర్‌లో ఇంతటి కోపం దాగి ఉందా అని క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 59 పరుగులతో విజయం సాధించింది. భారత ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ 5 వికెట్లతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 83 పరుగులకే కుప్పకూలి పరాజయం మూట గట్టుకుంది. (చదవండి : టీమిండియానే ఈ సిరీస్‌ గెలవాలి: పాక్‌ క్రికెటర్)‌

మరిన్ని వార్తలు