Sunil Gavaskar: రానున్న రెండు వరల్డ్‌కప్‌లకు అతడే కెప్టెన్‌గా ఉండాలి!

29 Sep, 2021 14:16 IST|Sakshi

Sunil Gavaskar Comments On Rohit Sharma: వరుస ఐసీసీ ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియా కెప్టెన్లనూ తరచూ మార్చడం సరికాదని లిటిల్‌ మాస్టర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ నుంచే భారత జట్టు సారథ్య బాధ్యతలు రోహిత్‌ శర్మకు అప్పగిస్తే బాగుంటుందని సూచించాడు. తద్వారా వచ్చే ఏడాది జరుగనున్న పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుందని పేర్కొన్నాడు. కాగా యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌-2021 ముగిసిన తర్వాత తాను ఈ ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తదుపరి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరు వినిపిస్తోంది. అయితే, కొంతమంది దిగ్గజాలు మాత్రం వయసు రీత్యా రోహిత్‌ను పక్కనపెట్టి కేఎల్‌ రాహుల్‌ లేదంటే రిషభ్‌ పంత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సునిల్‌ గావస్కర్‌ సైతం తొలుత తన ఓటు కేఎల్‌ రాహుల్‌కే అన్నాడు. కానీ, తాజాగా ఓ షోలో మాట్లాడుతూ... రోహిత్‌ రెండు మెగా ఈవెంట్లకు కెప్టెన్‌గా ఉండాలంటూ మాట మార్చాడు.

ఈ మేరకు.. ‘‘వచ్చే రెండు వరల్డ్‌కప్‌లకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉంటే మంచిది. ఒకటి వచ్చే నెలలో ఆరంభం కానుంది. మరొకటి... వచ్చే ఏడాది. కాబట్టి.. కెప్టెన్లను మారుస్తూ ఉంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. రెండు ప్రపంచకప్‌లకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండాలన్నదే నా నిశ్చిత అభిప్రాయం’’ అని సునిల్‌ గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. కోహ్లి స్థానంలో ఇప్పుడే హిట్‌మ్యాన్‌ సారథ్య బాధ్యతలు చేపడితే బాగుంటుందని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు మంచి రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. అతడి నేతృత్వంలో ముంబై ఇప్పటి వరకు ఐదు టైటిళ్లు గెలిచింది. మరోవైపు.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇంతవరకు ఒక్కసారి కూడా కప్‌ గెలవలేదు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

చదవండి: MI VS PBKS: టీ20ల్లో రికార్డు సృష్టించిన పొలార్డ్‌...

>
మరిన్ని వార్తలు