అశ్విన్‌‌ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్‌ కష్టమే

21 Feb, 2021 18:15 IST|Sakshi

ముంబై: రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా తరపున 2017లో చివరిసారి వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత అతను కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. మధ్యలో కొన్నిసార్లు టెస్టు జట్టులోనూ స్థానం కోల్పోయాడు. అయితే ఈ మధ్యన అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మెరుస్తూ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లే అందుకు నిదర్శనం. అయితే క్రమంగా వన్డే జట్టుకు మాత్రం దూరమయ్యాడు. టీమిండియా వన్డే జట్టులోకి  కుర్రాళ్ల రాకతో అశ్విన్‌ వన్డేలకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా అశ్విన్‌ వన్డే కమ్‌బ్యాక్‌పై లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూల్లో గవాస్కర్‌ స్పందించాడు.

'అశ్విన్‌ ఇక వన్డేల్లో కమ్‌బ్యాక్‌ ఇవ్వడం జరగదు.కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమవ్వాలి. టెస్టుల్లో మంచి ఆల్‌రౌండ్‌ర్‌గా ఎదిగిన అశ్విన్‌ అదే టెంపోనూ పరిమిత ఓవర్ల ఆటలో కొనసాగించలేకపోయాడు. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాల రాకతో వన్డేల్లో అశ్విన్‌ స్థానం కష్టమైంది. ఇక నెంబర్‌ 7లో హార్దిక్‌ లేదా జడేజా బరిలోకి దిగుతున్నారు. స్పిన్నర్లుగా చహల్‌, కుల్దీప్‌ రాణిస్తుండడంతో బౌలింగ్‌లోనూ అతని‌ అవసరం తీరిపోయింది. ప్రస్తుత వన్డే జట్టతో అశ్విన్‌ సరితూగలేడు.. కాబట్టి ఇంకో 6 సంవత్సరాలు అతను టెస్టు క్రికెటర్‌గానే ఆడాల్సి వస్తుంది.'అంటూ తెలిపాడు.

కాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా తరపున 111 వన్డేల్లో 150 వికెట్లు.. 675 పరుగులు చేశాడు. 46 టీ20ల్లో 123 పరగులు.. 52 వికెట్లు తీశాడు. ఇక 76 టెస్టుల్లో 394 వికెట్లు.. 2626 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. ఒక సెంచరీ చేయడంతో 9 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి పింక్‌బాల్‌(డే నైట్‌) టెస్టు జరగనుంది.
చదవండి: 'మాస్టర్‌' డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు
ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో..

>
మరిన్ని వార్తలు