Rohit Sharma: రోహిత్‌ ఆడనపుడు వీళ్లెవ్వరు మాట్లాడలేదు.. కోహ్లి విషయంలో మాత్రం: గావస్కర్‌

12 Jul, 2022 16:37 IST|Sakshi

‘‘రోహిత్‌ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. నిజానికి ఫామ్‌ అనేది తాత్కాలికం. క్లాస్‌ అనేదే శాశ్వతం’’ అని టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

గత కొంతకాలంగా కోహ్లి తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించినా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ కింగ్‌ కోహ్లికి కొన్ని సిరీస్‌లలో విశ్రాంతినిచ్చినా.. కీలక సిరీస్‌లకు మాత్రం ఎంపిక చేస్తున్నారు.

రోహిత్‌ ఫుల్‌ సపోర్టు!
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి మరోసారి విఫలం కావడంపై టీమిండియా మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు కోహ్లికి అవకాశాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అతడిని జట్టు నుంచి తప్పించాలని సూచించారు. అయితే, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం తమ వ్యూహాలకు అనుగుణంగానే బ్యాటర్లు ఆడతారని, ఇందులో వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కోహ్లికి మద్దతుగా నిలిచాడు.

పొట్టి ఫార్మాట్‌ వేరు!
తాజాగా ఈ విషయంపై స్పందించిన గావస్కర్‌ సైతం స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడారు. టీ20 ఫార్మాట్‌లో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఉంటాయన్న గావస్కర్‌.. ఆ క్రమంలో భారీ షాట్లకు యత్నించినపుడు ఒక్కోసారి సక్సెస్‌ అయితే.. మరోసారి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కోహ్లి విషయంలోనూ అదే జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో.. ‘‘కోహ్లికి సరైన సమయంలో వన్డే సిరీస్‌ ఆడే అవకాశం వచ్చింది. ఎందుకంటే.. అతడు వన్డే ఫార్మాట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన, సహజమైన ఆటతీరును కనబరచగలడు. టెస్టుల్లో మాదిరి ఇక్కడ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. హడావుడిగా కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా బంతిని అంచనా వేస్తూ ఆడే వెసలుబాటు ఉంటుంది’’ అని గావస్కర్‌ పేర్కొన్నారు.

నువ్వు చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లది తప్పా!?
అలా కోహ్లి విమర్శలకు పరోక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అరుదైన వికెట్ల ఫీట్‌ అందుకునేందుకు రిటైర్‌ కాకుండా తన కెరీర్‌ పొడిగించుకుంటూ యువకులకు అవకాశం రాకుండా చేసిన విషయం కపిల్‌ దేవ్‌కు గుర్తులేదా అంటూ ఇప్పటికే కోహ్లి ఫ్యాన్స్‌ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య మంగళవారం(జూలై 12) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌! ఇంకా..
IND VS ENG 1st ODI: అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌-ధవన్‌ జోడీ

>
మరిన్ని వార్తలు