ఏమాత్రం బాధ్యత లేని రోహిత్‌!

16 Jan, 2021 15:38 IST|Sakshi

బ్రిస్బేన్‌: నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగులకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ వికెట్లను కోల్పోయింది. రోహిత్‌ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ రెండో బంతికి గిల్‌ ఔట్‌ కాగా, లయన్‌ వేసిన 20 ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే, సులభమైన క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ ఔటైన తీరు అటు క్రికెట్‌ అభిమానులతో పాటు, క్రీడా విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. లయన్‌ వేసిన ఫ్లైట్‌ బంతిని మిడాన్‌ వైపునకు రోహిత్‌ షాట్‌ ఆడాడు. లాంగాన్‌లో ఉన్న స్టార్క్‌ కాస్త ముందుకు కదిలి దాన్ని ఒడిసిపట్టాడు. ఈక్రమంలో రోహిత్‌ షాట్‌ సెలక్షన్‌ అస్సలు బాగోలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. 
(చదవండి: నటరాజన్‌ అరుదైన ఘనత)

‘చానెల్‌ 7 క్రికెట్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన హిట్‌మ్యాన్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించాడు. లాంగాన్‌లో, స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అలాంటి షాట్‌ ఆడాలని ఎలా అనుకున్నావ్‌ అని వాపోయాడు. అంతకుముందు లైయన్‌ బౌలింగ్‌లో ఫోర్లు బాదిన రోహిత్‌.. అంతటి రాంగ్‌ షాట్‌ ఎందుకు ఆడాడో అర్థం కాలేదని గావస్కర్‌ తన కామెంటరీలో చెప్పుకొచ్చాడు. ఒక సీనియర్‌ అయి ఉండి అనవరసంగా వికెట్‌ సమర్పించుకున్నాడని వ్యాఖ్యానించాడు. కాగా, 274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ 369 పరుగులకు ఆలౌట్‌ అయింది. అరంగేట్ర బౌలర్లు నటరాజన్‌, సుందర్‌ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు. సిరాస్‌ ఒక వికెట్‌, మరో బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చతేశ్వర్‌ పుజారా (8), కెప్టెన్‌ అజింక్యా రహానే (2) క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 307 పరుగుల వెనకబడి ఉంది.
(చదవండి: హార్దిక్‌ పాండ్యా తండ్రి కన్నుమూత)

మరిన్ని వార్తలు