Sunil Narine: భీకర ఫామ్‌లో కేకేఆర్‌ ప్లేయర్‌..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం

2 Mar, 2022 15:55 IST|Sakshi

కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్ భీక‌ర‌మైన  ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్ 2022)లో మొదలైన అతని విధ్వంసకర ప్రదర్శన.. ప్రస్తుతం జరుగుతున్న ట్రినిడాడ్‌ టీ10 లీగ్‌లోనూ కొనసాగుతుంది. బీపీఎల్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లో అర్ధశతకం(5 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 57 పరుగులు), ఆమరుసటి మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్ధశతకం (5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 ప‌రుగులు) సాధించిన నరైన్‌.. తాజాగా ట్రినిడాడ్‌ లీగ్‌లో 22 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయమైన 68 పరుగులు చేసి ఐపీఎల్‌ 2022కి ముందు ప్రత్యర్ధి జట్లకు సవాలు విసురుతున్నాడు. ఈ లీగ్‌లో స్కోవా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్‌... కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కోవా కింగ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లియోనార్డో జూలియన్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటైన అనంతరం.. నరైన్‌, జేసన్‌ మహ్మద్ (33 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 93 పరుగులు)‌తో కలిసి ప్రత్యర్ధి (కవాలియర్స్)  బౌలర్లను ఊచకోత కోశాడు. అనంతరం కవాలియర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. కింగ్స్‌ బౌలర్లలో రేమండ్ 2 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాశించాడు.

ఇదిలా ఉంటే, ఇదే లీగ్‌లో నరైన్‌ కంటే ముందు విండీస్‌ హిట్టర్లు నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్ కూడా విధ్వంసం సృష్టించారు. పూరన్.. లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరఫున ఆడుతూ కేవలం 37 బంతుల్లో అజేయమైన శతకం (10 సిక్సర్లు, 6 ఫోర్లతో 101 పరుగులు) సాధించగా,  మరో మ్యాచ్‌లో ఎవిన్ లూయిస్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న లూయిస్‌ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు.కాగా, విండీస్‌ బ్యాటర్ల తాజా ఫామ్‌ చూసి వారిని సొంతం చేసుకున్న ఐపీఎల్‌ జట్లు తెగ సంబురపడిపోతున్నాయి. విండీస్‌ యోధులు ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆయా ఫ్రాంచైజీలు ఆకాంక్షిస్తున్నాయి. 
చదవండి: IPL 2022: సునీల్ న‌రైన్ ఊచ‌కోత‌.. సంబురాల్లో కేకేఆర్‌

మరిన్ని వార్తలు