సునీల్‌ నరైన్‌కు వార్నింగ్‌!

11 Oct, 2020 13:51 IST|Sakshi

దుబాయ్‌: కోల్‌కతా ఆటగాడు సునీల్‌ నరైన్‌కు అంపైర్లు వార్నింగ్‌ ఇచ్చారు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్‌ అనంతరం అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం నరైన్‌ బౌలింగ్‌ చేయవచ్చని, మరోసారి తన బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదు వస్తే ఈ సీజన్‌ ఐపీఎల్‌ నుంచి సస్పెండ్‌ చేస్తారన్నారు. కోల్‌కతా జట్టులో నరైన్‌ కీలక ఆటగాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా మెరిపించగలడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో రెండు కీలక ఓవర్లు వేశాడు. పంజాబ్‌ 18 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఆ సమయంలో 18వ ఓవర్‌ వేసిన నరైన్‌ కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.


ఇంతకు ముందూ ఇలాగే...
నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడం కొత్తేమి కాదు. 2014లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌లో రెండు సార్లు అతడిపై ఫిర్యాదులు వచ్చాయి. తన బౌలింగ్‌ కారణంగా 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో అతడిని సస్పెండ్‌ చేసింది. ఈ సారి తన బౌలింగ్‌ వైఖరిని మార్చుకోకపోతే వేటు తప్పదు. 

మరిన్ని వార్తలు