IPL 2023: ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్‌ కీలక నిర్ణయం.. ఈసారైనా

20 Mar, 2023 12:34 IST|Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా నెదర్లాండ్స్ ప్రధాన కోచ్ ర్యాన్ కుక్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ నియమించింది. గత ఏడాది సీజన్‌లో దారుణ ప్రదర్శన అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌.. తమ కోచింగ్‌ స్టాప్‌లో భారీ మార్పులు చేసింది.

ఈ క్రమంలోనే గతేడాది సీజన్‌లోనే బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా.. ఈ ఏడాది సీజన్‌లో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ర్యాన్‌ కుక్‌ విషయానికి వస్తే.. అతడు తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న  సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.

ఐపీఎల్‌ 16వ సీజన్ నేపథ్యంలో నెదర్లాండ్స్ తదుపరి రెండు ద్వైపాక్షిక సిరీస్‌లకు కుక్‌  దూరం కానున్నారు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఎస్‌ఆర్‌ హెచ్‌ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అతడు హెడ్‌కోచ్‌ బ్రియాన్‌ లారాతో కలిసి పని చేయనన్నాడు.

మార్‌క్రమ్‌ మ్యాజిక్‌ చేస్తాడా?
గత ఏడాది సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్‌ 16వ సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ తమ జట్టులో సమూల మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌ను సన్‌రైజర్స్‌ నియమించింది. 

కాగా  తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న  ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా మార్‌క్రమ్‌ సారథ్యం వహించాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా మార్‌క్రమ్‌ సారథిగా విజయవంతమవుతాడని ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్‌2న రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్‌ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు