SRH Vs PBKs: హైదరాబాద్‌ గెలిచిందోచ్‌!

22 Apr, 2021 04:10 IST|Sakshi
ఖలీల్‌కు సహచరుల అభినందన, బెయిర్‌స్టో

ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ బోణీ

పంజాబ్‌పై 9 వికెట్లతో ఘనవిజయం

బంతితో మెరిసిన ఖలీల్, అభిషేక్‌ శర్మ

బ్యాట్‌తో అదరగొట్టిన బెయిర్‌స్టో  

హ్యాట్రిక్‌ పరాజయాల నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తేరుకుంది. నాలుగో మ్యాచ్‌తో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి... అనంతరం ఛేజింగ్‌లో బెయిర్‌స్టో, వార్నర్, విలియమ్సన్‌ నిలకడగా ఆడటంతో సన్‌రైజర్స్‌ తమ ఖాతాలో తొలివిజయాన్ని వేసుకుంది.  

చెన్నై: వరుస పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొలి విజయాన్ని అందుకుంది. ఇక్కడి చెపాక్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్‌ ఖాన్‌ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

ఖలీల్‌ అహ్మద్‌ (3/21), అభిషేక్‌ శర్మ (2/24) బంతితో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 121 పరుగులు చేసి సీజన్‌లో బోణీ కొట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (56 బంతుల్లో 63 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... వార్నర్‌ (37 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించిన హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అతడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఆడుతూ పాడుతూ...
గత మూడు మ్యాచ్‌ల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న వార్నర్, బెయిర్‌స్టో ఈసారి ఎటువంటి తడబాటుకు గురి కాలేదు. స్వల్ప లక్ష్యమే కావడంతో నింపాదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి ఓవర్‌లో వార్నర్‌ పాయింట్‌ దిశగా ఫోర్‌ కొట్టగా... ఆ మరుసటి ఓవర్లో బెయిర్‌స్టో 4, 6 సాధించాడు. ఆ తర్వాత కూడా ఈ జంట బౌండరీలు రాబట్టడంతో హైదరాబాద్‌ స్కోరు బోర్డు సాఫీగా సాగింది. బౌండరీలతో పాటు వీరు సింగిల్స్, డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పవర్‌ప్లేలో రైజర్స్‌ 50/0తో నిలిచింది. పేసర్లతో లాభం లేదనుకున్న పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పిన్నర్లను బరిలోకి దించాడు. పిచ్‌పై బంతి టర్న్‌ అవుతుండటంతో జాగ్రత్త పడ్డ వార్నర్, బెయిర్‌స్టో  మూడు ఓవర్ల (7, 8, 9) పాటు బౌండరీ బాదలేకపోయారు.

అయితే పదో ఓవర్‌ మూడో బంతిని డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా సిక్సర్‌ కొట్టిన వార్నర్‌... అలెన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దాంతో 73 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. వార్నర్‌ అవుటయ్యే సమయానికి హైదరాబాద్‌ విజయ సమీకరణం 60 బంతుల్లో 48గా ఉంది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న కేన్‌ విలియమ్సన్‌ (19 బంతుల్లో 16 నాటౌట్‌)... బెయిర్‌స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హుడా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన బెయిర్‌స్టో 48 బంతుల్లో ఆర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సీజన్‌లో బెయిర్‌స్టోకి ఇది రెండో అర్ధ సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్, బెయిర్‌స్టో మరో వికెట్‌ పడకుండా ఇంకో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు.  

టపటపా...
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్‌ బౌలర్లు ఏ దశలోనూ క్రీజులోకుదురుకోనివ్వలేదు. పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ (4) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దగ్గర ఉన్న కేదార్‌ జాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఖాతా తెరవకముందే తాను ఇచ్చిన క్యాచ్‌ను రషీద్‌ ఖాన్‌ నేలపాలు చేయడంతో బతికిపోయిన మయాంక్‌ అగర్వాల్‌ రెండు ఫోర్లు కొట్టి టచ్‌లో ఉన్నట్లే కనిపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గేల్‌ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు)... సిద్ధార్థ్‌ కౌల్, ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఒక్కో బౌండరీ సాధించాడు. దాంతో పవర్‌ప్లేలో పంజాబ్‌ 32/1గా నిలిచింది. అయితే ఇక్కడే హైదరాబాద్‌ ఫీల్డర్లు మెరిశారు.

ఖలీల్‌ వేసిన ఏడో ఓవర్‌ చివరి బంతిని మయాంక్‌ పుల్‌ షాట్‌ ఆడగా... మిడ్‌వికెట్‌ దగ్గర ఉన్న రషీద్‌ ఖాన్‌ కుడి వైపునకు డైవ్‌ చేస్తూ బంతి నేలను తాకేలోపు చక్కటి క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై ఫీల్డ్‌ అంపైర్లు టీవీ అంపైర్‌ను సంప్రదించారు.. రీప్లేలో బంతి కింద రషీద్‌ ఖాన్‌ వేళ్లు ఉండటంతో క్లీన్‌ క్యాచ్‌గా పరిగణించిన టీవీ అంపైర్‌ తన నిర్ణయాన్ని అవుట్‌గా ప్రకటించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (0) ఒక్క బంతిని కూడా ఆడకుండానే రనౌట్‌ అయ్యాడు. ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి గేల్‌ సింగిల్‌ తీసే ప్రయత్నం చేయగా... వార్నర్‌ ఒక చక్కటి త్రోతో నేరుగా వికెట్లను గిరాటేసి పూరన్‌ (0)ను డగౌట్‌కు చేర్చాడు.

ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ గేల్‌ను వికెట్ల ముందు దొరకబ్చుకున్నాడు. దాంతో పంజాబ్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 53/4తో కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న దీపక్‌ హుడా (13), హెన్రిక్స్‌ (14)లను తన వరుస ఓవర్లలో అభిషేక్‌ శర్మ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ మూడంకెల స్కోరును చేరుకోవడం కూడా కష్టంగానే కనిపించింది. అయితే యువ ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్‌ మరోసారి పంజాబ్‌ పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు. రెండు సిక్సర్లు బాది జట్టు స్కోరును 100 దాటించాడు. చివర్లో మరోసారి కమ్‌బ్యాక్‌ చేసిన సన్‌రైజర్స్‌ షారుఖ్‌ ఖాన్‌తో పాటు మురుగన్‌ అశ్విన్‌ (9), షమీ (3)లను అవుట్‌ చేయడంతో పంజాబ్‌ 20 ఓవర్లను కూడా పూర్తిగా ఆడకుండానే ఆలౌటైంది.

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) జాదవ్‌ (బి) భువనేశ్వర్‌ 4; మయాంక్‌ అగర్వాల్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 22; క్రిస్‌ గేల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ ఖాన్‌ 15; నికోలస్‌ పూరన్‌ (రనౌట్‌) 0; దీపక్‌ హుడా (ఎల్బీ) (బి) అభిషేక్‌ శర్మ 13; హెన్రిక్స్‌ (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) అభిషేక్‌ శర్మ 14; షారుఖ్‌ ఖాన్‌ (సి) అభిషేక్‌ శర్మ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 22; అలెన్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ అహ్మద్‌ 6; మురుగన్‌ అశ్విన్‌ (సి) బెయిర్‌స్టో (బి) సిద్దార్థ్‌ కౌల్‌ 9; షమీ (రనౌట్‌) 3; అర్‌‡్షదీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 120.
వికెట్ల పతనం: 1–15, 2–39, 3–39, 4–47, 5–63, 6–82, 7–101, 8–110, 9–114, 10–120.
బౌలింగ్‌: అభిషేక్‌ శర్మ 4–0–24–2, భువనేశ్వర్‌ 3–0–16–1, ఖలీల్‌ అహ్మద్‌ 4–0–21–3, సిద్ధార్థ్‌ కౌల్‌ 3.4–0–27–1, విజయ్‌ శంకర్‌ 1–0–6–0, రషీద్‌ ఖాన్‌ 4–0–17–1.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) మయాంక్‌ (బి) అలెన్‌ 37; బెయిర్‌స్టో (నాటౌట్‌) 63; విలియమ్సన్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 121.
వికెట్ల పతనం: 1–73.
బౌలింగ్‌: షమీ2–0–16–0, ఫాబియన్‌ అలెన్‌ 4–1–22–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3.4–0–31–0, హెన్రిక్స్‌ 1–0–7–0, మురుగన్‌ అశ్విన్‌ 4–0–22–0, దీపక్‌ హుడా 4–0–22–0. 

>
మరిన్ని వార్తలు