IPL 2023: సంబరాల్లో సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌.. ఎందుకో తెలుసా..?

28 Feb, 2023 20:45 IST|Sakshi

Aiden Markram: ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి నెల రోజుల ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ అభిమానులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రారంభమైన టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్‌ మార్క్రమ్‌ సెంచరీ చేశాడు. మార్క్రమ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ఇటీవలే కెప్టెన్‌గా నియమించుకుంది. ఇదే ఎస్‌ఆర్‌హెచ్‌ సంబరాలకు కారణంగా నిలిచింది.

ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ను ఛాంపియన్‌గా నిలిపిన మార్క్రమ్‌.. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఎస్‌ఆర్‌హెచ్‌ను కూడా ఛాంపియన్‌గా నిలపాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. భీకర ఫామ్‌లో ఉన్న మార్క్రమ్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాలని అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 2 టెస్ట్‌లు,  3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు విండీస్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా ఇవాల్టి నుంచి తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. మూడో సెషన్‌ సమయానికి 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌ (71) అర్ధసెంచరీతో, మార్క్రమ్‌ (115) సెంచరీతో రాణించారు.

తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించిన సఫారీలు ఆతర్వాత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి భారీ స్కోర్‌ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. టోనీ డి జోర్జీ 28 పరుగులు చేసి ఔట్‌ కాగా.. కెప్టెన్‌ బవుమా 0, కీగన్‌ పీటర్సన్‌ 14, క్లాసెన్‌ 20, ముత్తుసామి 3 పరుగులు చేసి ఔటయ్యారు. జన్సెన్‌, రబాడ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్‌ రోచ్‌, కైల్‌ మేయర్స్‌, షానన్‌ గాబ్రియెల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.   


 

మరిన్ని వార్తలు