సన్‌రైజర్స్‌ చేతిలో కోల్‌‘కథ’

3 Nov, 2020 06:36 IST|Sakshi

నేడు ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌

గెలిస్తేనే వార్నర్‌ బృందం ముందుకు

హైదరాబాద్‌ ఓడితేనే నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌కు  

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నట్టే ఈసారీ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందే చివరి జట్టేదో లీగ్‌ ఆఖరి మ్యాచ్‌తోనే తేలనుండటం విశేషం. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ 18 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవడంతోపాటు పాయింట్ల పట్టికలో ‘టాప్‌’ పొజిషన్‌నూ ఖాయం చేసుకుంది.  

► సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ నెగ్గడంతో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. 14 పాయింట్లతో బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ (–0.172) కారణంగా నైట్‌రైడర్స్‌ (–0.214)ను వెనక్కి నెట్టిన బెంగళూరు మూడో జట్టుగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకుంది.  
► నాలుగో బెర్త్‌ రేసులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచాయి. 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాలంటే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతాకంటే మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోని హైదరాబాద్‌ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా  ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
► ఒకవేళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒక్కటే మార్గం ఉంది. ముంబై చేతిలో సన్‌రైజర్స్‌ ఓడిపోవాలి. లేదంటే మ్యాచ్‌ అయినా రద్దు కావాలి. మ్యాచ్‌ రద్దయిన పక్షంలో హైదరాబాద్‌కు ఒక్క పాయింట్‌ వస్తుంది. ఆ జట్టు 13 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమవుతుంది. 14 పాయింట్లతో కోల్‌కతా ముందంజ వేస్తుంది. అయితే యూఏఈలో మ్యాచ్‌ రద్దయ్యే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం లేవు కాబట్టి కోల్‌కతా జట్టు హైదరాబాద్‌ ఓడిపోవాలని కోరుకోవాలి.  

మరిన్ని వార్తలు