BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్‌ క్యూరీగా మణిందర్‌ సింగ్‌

21 Jul, 2022 19:04 IST|Sakshi

బీసీసీఐకి సంబంధించిన వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది. గంగూలీ, జై షా సహా ఇతర ఆఫీస్‌ బేరర్లు పదవుల్లో కొనసాగడంపై రాజ్యాంగ సవరణకు సంబంధించిన పిటిషన్‌ను బీసీసీఐ గతంలోనే సుప్రీంకోర్టులో వేసింది.

తాజాగా ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధార్మసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అమికస్‌ క్యూరీగా మణిందర్‌ సింగ్‌ నియమిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌కు సంబంధించిన విచారణను తిరిగి జూలై 28న చేపడతామని తెలిపింది. కాగా ఇంతకముందు అమికస్‌ క్యూరీగా ఉన్న పీఎస్‌ నరసింహ న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో మణిందర్‌ సింగ్‌ నియమించారు.

జస్టిస్‌ ఆర్ఎం లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లో గరిష్టంగా ఆరేళ్లకు మించి పనిచేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మధ్యలో మూడేళ్ల విరామం తప్పనిసరి అనే నిబంధన ఉంది. గంగూలీ, జై షాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లో సుధీర్ఘ కాలం పనిచేశారు. గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌​ అసోసిచేషన్‌.. జై షా గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో విధులు నిర్వర్తించారు. నిబంధనల ప్రకారం చూస్తే గంగూలీ, జై షాలు ఎప్పుడో ఆ పదవి నుంచి దిగిపోవాలి. అయితూ డిసెంబర్‌ 2019లో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో మూడేళ్ల విరామం నిబంధనను తొలగిస్తూ ప్రతిపాదనను తీసుకొచ్చింది.

చదవండి: బీసీసీఐ పిటిషన్‌పై విచారణ వాయిదా

గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతారా? వారంలో వీడనున్న ఉత్కంఠ

మరిన్ని వార్తలు