Hockey: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం

8 Sep, 2021 15:29 IST|Sakshi

Supreme Court Rejects Plea To Recognize Hockey As India's National Game: హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని తగు రీతిలో తాము ఆదేశించలేమంటూ స్పష్టం చేసింది.

క్రికెట్ వల్ల హాకీ తన ప్రభావాన్ని కోల్పోతోందని.. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. విశాల్ తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా తాము కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారిణిలు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.
చదవండి: టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు