చెన్నైతోనే సురేశ్‌ రైనా

21 Jan, 2021 05:11 IST|Sakshi

స్మిత్‌ను సాగనంపిన రాజస్తాన్‌ రాయల్స్‌

మలింగకు ముంబై గుడ్‌బై

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు సురేశ్‌ రైనాను అట్టిపెట్టుకుంది. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో ఆడటం కోసం రైనా అక్కడిదాకా వెళ్లి... అనూహ్యంగా తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని,  బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ ఇప్పుడు సూపర్‌కింగ్స్‌ రైనాను అట్టిపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను చెన్నై విడుదల చేసింది.

భజ్జీ కూడా గత సీజన్‌ ఆడలేదు. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు వేలం కోసం బుధవారం (జవవరి 20) ఆటగాళ్ల విడుదలకు, అట్టిపెట్టుకునేందుకు ఆఖరి రోజు కావడంతో ఫ్రాంచైజీలన్నీ జాబితాలు విడుదల చేశాయి. రాజస్తాన్‌ రాయల్స్‌ అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను సాగనంపగా... ముంబై ఇండియన్స్‌ తమ తురుపుముక్క లసిత్‌ మలింగ (శ్రీలంక)ను వదులుకుంది. కోహ్లి జట్టు బెంగళూరు భారత సీనియర్‌ సీమర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు గుడ్‌బై చెప్పింది. పంజాబ్‌ ఫ్రాంచైజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను వేలానికి వెళ్లమంది. స్మిత్‌ను పంపించిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా సంజూ సామ్సన్‌ను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 11న మినీ వేలం నిర్వహించే అవకాశముంది.

మరిన్ని వార్తలు