టీమిండియా నెక్ట్స్ ధోనీ తనే: రైనా

29 Jul, 2020 12:52 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ధోని తర్వాత జట్టు సారథిగా అంతటి గొప్ప నాయకత్వ లక్షణాలను రోహిత్‌ శర్మలో చూశానని క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో హిట్‌మ్యాన్‌ మరో ధోనిలాంటి వాడని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రతీ ఆటగాడి సూచనలు, సలహాలకు విలువనిస్తాడని.. అందరినీ గౌరవిస్తాడని చెప్పుకొచ్చాడు. తన కెప్టెన్సీలో ఆడటం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుందని పేర్కొన్నాడు. సూపర్‌ ఓవర్‌ పోడ్‌కాస్ట్‌ తాజా ఎపిసోడ్‌లో భాగంగా సౌతాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినితో మాట్లాడిన ఈ ఎడమచేతి వాటం క్రికెటర్‌ తన క్రీడా జీవితంలోని అనుభవాల గురించి పంచుకున్నాడు. (‘సురేశ్‌ రైనా కెరీర్‌ ముగిసినట్లే’)

ఈ క్రమంలో రోహిత్‌ శర్మ గురించి రైనా మాట్లాడుతూ.. ‘‘ తను చాలా కామ్‌గా ఉంటాడు. ఎదుటి వాళ్లు చెప్పేది ఓపికగా వింటాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. ముందుండి నడిపిస్తాడు. కెప్టెన్‌గా ఉన్నా డ్రెస్సింగ్‌ రూంలో అందరినీ గౌరవిస్తాడు. ప్రతీ ఒక్కరు కెప్టెన్‌లాంటి వాళ్లే కదా అంటాడు. తన సారథ్యంలో ఆసియా కప్‌ ఆడాను. అప్పుడు మరింత దగ్గరగా తనను గమనించాను. శార్దూల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించిన తీరు అమోఘం. నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్‌ శర్మ పేరే చెబుతాను. 

ధోనిలాగే తను కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు. తనలాగే ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచాడు. జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను. సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను’’ అని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సురేశ్‌ రైనా.. రోహిత్‌ కెప్టెన్సీలో నిదహాస్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు