థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ : రైనా

21 Aug, 2020 09:31 IST|Sakshi

ఢిల్లీ : ఆగస్టు 15.. 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్‌ ధోనితో పాటు సురేశ్‌ రైనా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టుకు రెండు మేజర్‌ టైటిళ్లను(2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌) అందించిన ధోనిని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా లేఖను విడుదల చేశారు. ధోనితో పాటే వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనాకు కూడా మోదీజీ లేఖ రాశారు. రైనాకు రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది.(చదవండి : ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ధోని!)

'రైనా.. ఆగస్టు 15న నువ్వు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. కానీ దానిని నేను రిటైర్మెంట్‌ అనే పదంతో పిలవలేను.. ఎందుకంటే ఇంకా నీకు ఆడే సత్తా ఉంది.. ఎంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ప్లేయర్‌గా కనిపించే నువ్వు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతావని ఊహించలేదు. ఏది ఏమైనా నీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకాలం భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలందించావు. ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడావు.

2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు, 28 ఏళ్ల సంవత్సరాల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ జట్టులో నువ్వు సభ్యుడిగా ఉన్నావు. 2011 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నీ ప్రదర్శన దగ్గర్నుంచి చూశాను. ఆరోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. జట్టుకు నీలాంటి మంచి ఫీల్డర్‌ అవసరం ఎంతో ఉంది. నీ వీడ్కోలుతో భారత్‌ జట్టు దానిని మిస్సవుతుంది. నువ్వు ఏం చేసినా అది దేశానికి ఎంతో దోహదపడింది.. థ్యాంక్యూ సురేశ్‌ రైనా' అంటూ మోదీ చెప్పుకొచ్చారు.(టీమిండియా క్రికెటర్‌ నిశ్చితార్థం)

తాజాగా మోదీ రాసిన లేఖపై రైనా ట్విటర్‌లో స్పందించాడు. ' థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ.. మీరిచ్చిన సందేశం మాకు చాలా విలువైనది. దేశం తరపున ఆడేటప్పుడు.. విజయం కోసం  స్వేదాన్ని చిందిస్తాం... దేశ ప్రధానితో పాటు ,  ప్రజలు మా ప్రదర్శనను గుర్తించి మెచ్చుకోవడం కంటే గొప్ప విషయం ఏది లేదు. మీరిచ్చిన సందేశాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తున్నా.. జైహింద్‌' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నాడు.

13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా ఘనత వహించాడు. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు (టెస్టుల్లో 23+వన్డేల్లో 102+టి20ల్లో 42) తీసుకున్నాడు.  

మరిన్ని వార్తలు