T20 Blast 2022: విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా

23 Jun, 2022 09:20 IST|Sakshi

ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. కానీ ఇది టి20 మ్యాచ్‌. మరుక్షణం ఏం జరుగుతుందన్నది ఎవరు ఊహించలేరు. ఒక బంతికి రన్‌ తీస్తే.. మరుసటి బంతికి వికెట్‌ పడడం.. ఆ తర్వాత బౌండరీ.. మరోసారి వికెట్‌.. ఇలా ఆఖరి ఓవర్‌ ఒక థ్రిల్లర్‌ను తలపించింది. ఈ ఘటన విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సోమర్‌సెట్‌, సర్రీ మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది.


విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. టామ్‌ బాండన్‌ 39, గోల్డ్‌వార్తి 27, లామోన్బీ 21 పరుగులు చేశారు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన సర్రీ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వరకు సజావుగానే సాగింది. 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పీటర్‌ సిడిల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి సింగిల్‌ వచ్చింది. రెండో బంతికి 14 పరుగులు చేసిన జోర్డాన్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన నికో రీఫర్‌ మూడో బంతిని బౌండరీ తరలించాడు.

విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన దశలో రెండు వరుస బంతుల్లో సర్రీ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖరి బంతికి ఫోర్‌ అవసరం కాగా.. కాన్‌ మెకర్‌ బౌండరీ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలా కనివినీ ఎరుగని హైడ్రామాలో సర్రీ విజేతగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: కరోనా బారిన పడ్డా.. కోహ్లి చేసింది కరెక్టేనా!

మరిన్ని వార్తలు