'ఆడడమే నా పని.. ఔట్‌ నా చేతుల్లో ఉండదు'

19 Mar, 2021 12:15 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ వివాదాస్పద అవుట్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. సూర్య అవుట్‌ కాదని స్పష్టంగా కనిపిస్తున్నా.. ఫీల్డ్‌ అంపైర్‌తో పాటు థర్డ్‌ అంపైర్‌ కూడా అవుట్‌ ఇవ్వడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాను ఔటైన తీరుపై సూర్యకుమార్‌ స్పందించాడు. ఆడడం ఒక్కటే మన పని.. ఔట్‌కు సంబంధించిన నిర్ణయాలు మన చేతిలో ఉండవుని పేర్కొన్నాడు.

''నా అవుట్‌ విషయం పక్కనబెడితే మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌తో సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే నేను ఈరోజు జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా తరపున మూడో స్థానంలో ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేనుకున్న ప్రకారమే నా ఆటతీరు కొనసాగింది.. ఐపీఎల్‌లో ఆడేటప్పుడు జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను మూడు సీజన్ల నుంచి గమనిస్తూ వచ్చాను. ఇప్పుడు అతని బౌలింగ్‌ నాకు కష్టంగా అనిపించలేదు.

ఇక ఔట్‌ విషయం నా చేతుల్లో లేదు కాబట్టి నేను నిరుత్సాహంగా లేను.. ఆడడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.. దాన్ని అయితే కంట్రోల్‌ చేయగలను కానీ ఔట్‌ను కంట్రోల్‌ చేయలేము.ఏ ఆటగాడైనా సరే ఫీల్డ్‌ అంపైర్‌ లేదా థర్ఢ్‌ అంపైర్‌ తుది నిర్ణయానికి కట్టుబడాల్సిందే. ఇదేమి నేను పెద్ద విషయంగా చూడదలచుకోలేను. అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్‌(31 బంతుల్లో 57; 6ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.  అయితే అనూహ్యంగా  స్యామ్‌ కరన్‌ వేసిన 14వ ఓవర్‌ రెండో బంతిని సూర్య కుమార్‌ షాట్‌ ఆడగా ఫైన్‌లెగ్‌లో ఉన్న డేవిడ్‌ మలాన్‌ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్‌ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్‌ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 2-2తో సమానంగా ఉండడంతో శనివారం జరగనున్న ఆఖరి టీ20 కీలకంగా మారింది.
చదవండి:
ఇంగ్లండ్‌ తొండి.. సూర్య ఔట్‌ కాదు

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌: సూర్య కుమార్‌కు పిలుపు

మరిన్ని వార్తలు