Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్‌ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’

1 Feb, 2023 11:58 IST|Sakshi

India vs New Zealand, 3rd T20I- Suryakumar Yadav: ‘‘ఎలాంటి పిచ్‌పై ఆడామన్న విషయంతో పనిలేదు. మన ఆధీనంలో లేని అంశాల గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. మనం చేయగలిగింది చేయాలి. పరిస్థితికి తగ్గట్లుగా ముందుకు సాగాలి. వన్డే లేదంటే టీ20.. ఏదైనా లో స్కోరింగ్‌ లేదా భారీ స్కోరు.. ఆటలో పోటాపోటీ ఉంటేనే మజా. 

సవాలును స్వీకరించి ముందుకు సాగిపోవాల్సిందే’’ అని టీమిండియా టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. లక్నో పిచ్‌ గురించి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు. కాగా రెండో టీ20లో న్యూజిలాండ్‌ను 99 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు.. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.

సూర్య, హార్దిక్‌ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడటంతో ఎట్టకేలకు ఓ బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఈ నేపథ్యంలో లక్నో పిచ్‌ తమను విస్మయానికి గురిచేసిందంటూ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు.

మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది
ఇదిలా ఉంటే.. మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న టీమిండియా- న్యూజిలాండ్‌ అహ్మదాబాద్‌లో ఆఖరి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన సూర్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘లక్నో పిచ్‌ గురించి నేను, హార్దిక్‌ మ్యాచ్‌ తర్వాత మాట్లాడుకున్నాం. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. నిజానికి మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. గతంలోనూ మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశాం. 

రెండో టీ20లో ఆఖరి ఓవర్లో కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. అయినప్పటికీ చిరునవ్వుతోనే దానిని అధిగమించాలనుకున్నాం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాం’’ అని సూర్య పేర్కొన్నాడు.

ఎమోషనల్‌ అయిన సూర్య
ఇక మొతేరాలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్య.. ఆ తర్వాత ఇక్కడ ఆడనుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో.. ‘‘గత జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నేను ఇక్కడైతే మొదలుపెట్టానో ఈరోజు అక్కడే మరోసారి ఆడబోతున్నానని మా మేనేజర్‌తో అన్నాను’’అంటూ ఉద్వేగానికి గురయ్యాడు.

అయితే, అప్పటికి.. ఇప్పటికి తనలో చాలా మార్పు వచ్చిందన్న ఈ ముంబైకర్‌.. అందమైన స్టేడియంలో అద్భుతమైన ప్రేక్షకుల నడుమ ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

కాగా నాటి మ్యాచ్‌లో సూర్య అరంగ్రేటం చేసిన్పటికీ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఇషాన్‌ కిషన్‌(56), విరాట్‌ కోహ్లి(73) అర్ధ శతకాలతో చెలరేగడంతో 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉండగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున​ ‘స్కై’ ప్రస్తుతం టీ20లలో నంబర్‌ 1గా ఉండటమే గాక.. ఇటీవలే ఐసీసీ టీ20 క్రికెటర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

చదవండి: IND Vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్‌.. ఫ్లైట్‌ మిస్సయిన ఆసీస్‌ క్రికెటర్‌
Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!

మరిన్ని వార్తలు