SuryaKumar Yadav: 'ఒక్కడిని ఏం చేయగలను.. ఓటమి బాగా హర్ట్‌ చేసింది'

11 Nov, 2022 15:58 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అవమానానికి జట్టులో అందరూ ఆటగాళ్లు బాధపడొచ్చు.. కానీ అందరికంటే ఎక్కువ బాధ ఇద్దరు బాగా అనుభవిస్తున్నారు. వాళ్లిద్దరే విరాట్‌ కోహ్లి, సూర్య కుమార్‌ యాదవ్‌లు.

ఈసారి టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే ఈ ఇద్దరి గురించే తప్ప చెప్పడానికి కూడా పెద్దగా ఏం ఉండదు. సూపర్‌-12 దశలో కోహ్లి రెండు మ్యాచ్‌లు గెలిపిస్తే.. సూర్యకుమార్‌ మరో రెండు గెలిపించాడు. కోహ్లితో పోటీ పడి మరి పరుగులు సాధించేందుకు సూర్యకుమార్‌ ప్రయత్నించాడు. అందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. కానీ జట్టు సరిగ్గా ఆడకపోతే వీరిద్దరు మాత్రం​ ఏం చేయగలరు. అందుకే వీరి బాధ వర్ణణాతీతం. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని కింగ్‌ కోహ్లి ట్వీట్‌ చేసిన కాసేపటికే సూర్యకుమార్‌ కూడా స్పందించాడు.

ఈ పరాజయం మమ్మల్ని బాగా హర్ట్‌ చేసింది. అయితే సెమీస్‌లో తడబడడం మా కొంపముంచింది. మేము ఎక్కడ మ్యాచ్‌ ఆడితే అక్కడ జోష్‌ వాతావరణాన్ని సృష్టించిన అభిమానులకు కృతజ్ఞతలు. ఇంత మద్దతు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్‌. అభిమానం చూస్తుంటే అసలు ఈ వరల్డ్‌కప్‌ ఆస్ట్రేలియాలో ఆడుతున్నట్లే అనిపించలేదు. ఇక జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్ చేసిన కృషికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా దేశం తరపున ఆడటం గర్వంగా ఉంది. మేము తిరిగి ఫుంజుకుంటాం.. బలంగా తిరిగివస్తాం అంటూ పేర్కొన్నాడు.

ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా ఆరు మ్యాచ్‌ల్లో 189 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 29 ఇన్నింగ్స్‌ల్లోనే 1040 పరుగులు సాధించిన సూర్య ఎంత భీకరమైన ఫామ్‌లో ఉన్నాడో అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే టీమిండియా ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి బౌలింగ్‌తో ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌ దాకా రావడమే చాలా ఎక్కువని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా బౌలర్లు పూర్తి స్థాయిలో చేతులెత్తేయడం టీమిండియా బలహీనతను బయటపెట్టిందన్నారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనని తెలిపారు. కళ్ల ముందు జరిగింది కాబట్టి ఏం చెప్పలేక సర్దుకుపోతున్నాం.. ఇంకా నయం ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో ఓడి ఉంటే టీమిండియా ఆటగాళ్లకు భారీ అవమానాలు జరిగేవన్నారు. ఇలాంటివి చూడకుండానే సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టి మంచి పని చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు