ICC T20 Rankings: సూర్య అగ్రస్థానం మరింత పదిలం.. 22 స్థానాలు ఎగబాకిన అలెక్స్‌ హేల్స్‌

16 Nov, 2022 15:50 IST|Sakshi

ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో హేల్స్‌ ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో అలెక్స్‌ హేల్స్‌ 47 బంతుల్లోనే 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ప్రపంచకప్‌లో అలెక్స్‌ హేల్స్‌ 212పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

ఇక టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం నెంబర్‌వన్‌ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్‌ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న సూర్యకుమార్‌ ఖాతాలో 859 పాయింట్లు ఉన్నాయి.

ఇక ఆ తర్వాత పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకోగా.. ఒక స్థానం పడిపోయిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవన్‌ కాన్వే 771 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా మార్ర్కమ్‌, డేవిడ్‌ మలాన్‌, రిలీ రొసౌ, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఆరోన్‌ ఫించ్‌, పాతుమ్‌ నిస్సాంకలు ఉన్నారు.

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే ఇంగ్లండ్‌ బౌలర్లు ఆదిల్‌ రషీద్‌, సామ్‌ కరన్‌లు ముందంజ వేశారు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో సెమీఫైనల్‌, పాకిస్తాన్‌తో ఫైనల్లో మంచి ప్రదర్శన కనబరిచిన రషీద్‌ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ రెండు స్థానాలు ఎగబాకి టాప్‌-5కి చేరుకున్నాడు. ఇక లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా 704 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్గన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: అశ్విన్‌ విషయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

మరిన్ని వార్తలు