Suryakumar Yadav: సూర్యకుమార్‌ వన్డేలకు పనికిరాడా?

17 Mar, 2023 19:15 IST|Sakshi

సూర్యకుమార్ యాదవ్.. టి20ల్లో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టి20 క్రికెట్‌లో అతన్ని ఆపే శక్తి ఏ బౌలర్‌కు లేదన్న తరహాలో రెచ్చిపోతుంటాడు.  2021 మార్చిలో టి20 ఆరంగ్రేటం తర్వాత ఒకటికి మూడు సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్లలో 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేశాడు. ఇది పొట్టి క్రికెట్‌లో అతని గణాంకాలు. 

కానీ వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం సూర్యకుమార్‌ తేలిపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన సూర్య వన్డేల్లో మాత్రం ఇమడలేకపోతున్నాడు. టి20ల్లో అరంగేట్రం చేసిన మూడు నెలల్లోనే అంటే 2021 జూలైలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి  27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఇప్పటివరకు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. 

తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్‌ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. గత పది మ్యాచ్‌ల్లో సూర్య చేసిన స్కోర్లు వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఫిఫ్టీ మార్క్‌ అందుకోలేకపోయిన సూర్య ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కానీ అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ సూర్యకుమార్ యాదవ్‌కి చోటు లేదు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శ్రేయాస్‌ అయ్యర్‌ గాయపడడంతో సూర్యకు చాన్స్‌ ఇచ్చారు.  అయితే సూర్య మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన ప్లాఫ్‌ షో కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇషాన్‌ కిషన్‌ పరిస్థితి అంతంతే..


బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాది లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. అయితే  ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించలేకపోతున్నాడు. దీనికి తోడు గిల్‌ రాణిస్తుండడంతో ఇషాన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా రోహిత్‌ శర్మ తొలి వన్డేకు దూరంగా ఉండడంతో ఇషాన్‌కు మరోసారి అవకాశమొచ్చింది. అయితే వచ్చిన చాన్స్‌ను ఇషాన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడతారు. అంతేకాదు ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. టీ20ల్లో ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్‌లోనూ ఒకేలా ఫెయిల్ అవుతూ వస్తున్నారు.

చదవండి: IND Vs AUS 1st ODI: దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే!

IND Vs AUS: కోహ్లి వికెట్‌తో మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఫీట్‌

మరిన్ని వార్తలు