ఇంగ్లండ్‌ తొండి.. సూర్య ఔట్‌ కాదు

19 Mar, 2021 06:47 IST|Sakshi

అహ్మదాబాద్:‌ ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ వివాదాస్పదరీతిలో ఔట్‌ అయ్యాడు. రిప్లైలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి సూర్య బలి కావాల్సి వచ్చింది. అప్పటికే సూర్య కు​మార్‌ చక్కని ఇన్నింగ్స్‌ ఆడుతూ భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.

స్యామ్‌ కరన్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతిని స్వీప్‌షాట్‌తో లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదిన యాదవ్‌ తర్వాత బంతిని అలాగే ఆడాడు. కానీ ఫైన్‌లెగ్‌లో మలాన్‌ క్యాచ్‌పట్టాడు. అయితే బంతి అతని చేతుల్లో పడీపడగానే నేలనీ తాకింది. టీవీ అంపైర్‌ పలుమార్లు రీప్లే చేసి నిమిషాలపాటు చూసి ఫీల్డ్‌ అంపైర్‌ ఇచ్చిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌ అవుట్‌’కే మొగ్గుచూపడంతో సూర్యకుమార్‌ క్రీజు వీడాడు. అంత స్పష్టంగా నేలను తాకినా అవుటివ్వడంపై డగౌట్‌లో ఉన్న కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్‌ రాయ్‌ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఈ దశలో 17వ ఓవర్‌ వేసిన శార్దుల్‌ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
చదవండి:
సూర్య ప్రతాపం.. భారత్‌ విజయం

మరిన్ని వార్తలు