సూర్యకుమార్‌ జట్టులో ఆ ఇద్దరు స్టార్‌లకు దక్కని చోటు..

11 Jul, 2021 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌యాదవ్‌.. తన ఐపీఎల్ డ్రీమ్‌ ఎలెవన్‌ను ఎన్నుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. సూర్యకుమార్‌ను తన డ్రీమ్‌ ఐపీఎల్‌ జట్టును ప్రకటించమని కోరాడు. అయితే హర్షా భోగ్లే సూర్యకుమార్‌కు రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురిని ఎంచుకోవాలన్నది రెండోది.

ఈ నిబంధనలకి లోబడే సూర్యకుమార్ తన ఐపీఎల్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే, సూర్య తన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌ ధోనీకి, ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ ఆటగాడు, ఆసీస్‌ విధ్వంసకర వీరుడు డేవిడ్‌ వార్నర్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం. ఓపెనర్ల కోటాలో ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ జోస్ బట్లర్‌ను ఎనుకున్న సూర్య.. ఓపెనింగ్‌ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనీని పక్కకు పెట్టేశాడు. ఈ ఒక్క దెబ్బతో ధోనీకి, ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ వార్నర్‌కు ఒకేసారి చెక్‌ పెట్టాడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఏంపిక చేసిన ఆయన.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు.

ఇక, నాలుగో స్థానం కోసం తన పేరును ప్రకటించుకున్న సూర్య.. ఐదో ప్లేస్‌ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎన్నుకున్నాడు. సూర్యకుమార్ తన జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 స్థానాల్లో అవకాశం ఇచ్చాడు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్‌ను ఎంచుకున్న సూర్యకుమార్‌.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకున్నాడు. కాగా, సూర్యకుమార్‌.. ప్రస్తుతం ధవన్‌ జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్‌.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. 

సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్:
జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు