సూర్య కుమార్, తెవాటియాలకు చాన్స్‌

21 Feb, 2021 05:35 IST|Sakshi

ఇషాన్‌ కిషన్‌ కూడా

ఇంగ్లండ్‌తో టి20లకు భారత జట్టు ప్రకటన

ముంబై: ముంబై బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టులో అతనికి చోటు దక్కింది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా ముంబై తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినా... ఇన్నాళ్లూ సూర్యకుమార్‌కు టీమిండియాలో అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లోనే రాజస్తాన్‌ తరఫున ఆకట్టుకున్న రాహుల్‌ తెవాటియాకు  కూడా తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది.

ముంబై ఇండియన్స్‌ తరఫునే పలు దూకుడైన ఇన్నింగ్స్‌లు ఆడిన జార్ఖండ్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ కూడా తొలి సారి భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ... సంజు సామ్సన్‌పై వేటు వేసింది. బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లను కూడా జట్టునుంచి తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గాయంనుంచి కోలుకొని భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం చేస్తుండగా... ఊహించినట్లుగా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. 12 మార్చినుంచి 20 మార్చి వరకు మొటెరా స్టేడియంలోనే ఐదు టి20లు జరుగుతాయి.  

జట్టు వివరాలు:
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), రాహుల్, ధావన్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, పంత్, ఇషాన్‌ కిషన్, చహల్, చక్రవర్తి, అక్షర్, సుందర్, తెవాటియా, నటరాజన్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, నవదీప్, శార్దుల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు