రోహిత్‌ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే

8 Oct, 2020 19:36 IST|Sakshi

దుబాయ్‌ : సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఇదే సూర్యకుమార్‌ దేశవాలి క్రికెట్‌లో మెరుగ్గా రాణించినా అనామక ఆటగాడిగానే ఐపీఎల్‌కు పరిచయమయ్యాడు. అతని ఐపీఎల్‌ కెరీర్‌ తొలుత ముంబై ఇండియన్స్‌తోనే మొదలైంది. 2012లో ముంబై ఇండియన్స్‌ సూర్యకుమార్‌ను కొనుగోలు చేసింది. కానీ అతనికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. కారణం .. ముంబై జట్టులో అప్పటికే సీనియర్‌ ఆటగాళ్లైన సచిన్‌, రోహిత్‌ శర్మ, పొలార్డ్‌ సహా మిగతా ఆటగాళ్ల మధ్య అతను లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చేది.. ఒక్కోసారి ఆ అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత 2014లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కేకేఆర్‌ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అతని ఆటస్వరూపం మారిపోయింది. (చదవండి : మా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది : ప్లెమింగ్‌)

ముఖ్యంగా ఐపీఎల్‌ 2015లో ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 98 పరుగుల క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే చేదనలో భాగంగా కేకేఆర్‌ తరపున సూర్యకుమార్‌ కేవలం 20 బంతులెదుర్కొని 5 సిక్స్‌లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అప్పుడే సూర్యకుమార్‌ అనే పేరు మారుమోగింది. సూర్య ఇన్నింగ్స్‌తో రోహిత్‌ శర్మ క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఐపీఎల్‌ కెరీర్‌లో సూర్యకుమార్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కేకేఆర్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2018లో జరిగిన వేలంలో సూర్యకుమార్‌ను రూ. 3.2 కోట్లతో మళ్లీ ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. (చదవండి : అతను చాలా డేంజరస్‌ ప్లేయర్‌: సచిన్)‌

అప్పటినుంచి ముంబైకి ఆడుతున్న సూర్యకుమార్‌ జట్టులో కీలకంగా మారాడు. ఓపెనర్ల తర్వాత వన్‌డౌన్‌లో వస్తూ సూర్యకు​మార్‌ యాదవ్‌ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్‌ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచి మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ జర్నీపై పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 

' ఐపీఎల్‌లో నేను ఆడిన ప్రతీ స్థానాన్ని ఇష్టపడుతా. ముంబై ఇండియన్స్‌కి ఆడిన కొత్తలో ఎక్కువగా లోయర్‌ ఆర్డర్‌లో ఆడేవాడిని. కానీ ఈరోజు నా ప్రదర్శనతో టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం.. రాణించడం సంతోషంగా ఉంది. ముంబై నుంచి కేకేఆర్‌కు మారిన తర్వాత కూడా లోయర్‌ ఆర్డర్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. లోయర్‌ ఆర్డర్‌లో వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మొదట బ్యాటింగ్‌ చేస్తే స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేయాలి.. చేజింగ్‌లో అయితే మెరుపులు మెరిపించాలి. ఇలాంటి ఇన్నింగ్స్‌లు నాకు చాలానే ఉపయోగపడ్డాయి. వేలంలో ముంబైకి వచ్చిన తర్వాత నాకు బాధ్యత మరింత పెరిగింది. ముంబైకి ఆడిన చాలా సందర్భాల్లో యాంకరింగ్‌ పాత్ర పోషించాల్సి వచ్చింది.

కానీ గత రెండు మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కారణం ముంబై కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ. 2018లో నేను మళ్లీ ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్‌ నన్ను నమ్మి టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో అతను ఒకటే చెప్పాడు. నీ ఆట నువ్వు ఆడు.. ఫలితం అదే వస్తుంది. అప్పటినుంచి నేను రోహిత్‌ శర్మను గుడ్డిగా నమ్ముతూ వస్తున్నా.. అందుకే నా ఆటతీరు లో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది. రిషబ్‌ పంత్‌ నుంచి నా వరకు చూసుకున్నా మా జనరేషన్‌లో దూకుడైన ఆటతీరుకు రోహిత్‌ను ఆదర్శంగా తీసుకుంటాం. అందుకే మ్యాచ్‌కు ముందు, తర్వాత రోహిత్‌ ను కలిసి ఎన్నో సలహాలు తీసుకుంటా. అతను చెప్పే విషయాలను శ్రద్దగా వింటూ దానిని మ్యాచ్‌లో ఆచరించడానికి ప్రయత్నిస్తా. అంతేగాక ప్రాక్టీస్‌ సమయం, జిమ్‌ టైమ్‌ ప్లేస్‌ ఏదైనా సరే తన ప్రతి అనుభవాన్ని మాతో పంచుకుంటాడు. క్లిష్ట సమయాల్లో అతను ఎదుర్కొన్న తీరును స్పష్టంగా వివరించేవాడు. అందుకే రోహిత్‌ను నేను గుడ్డిగా నమ్ముతా. అంటూ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 91 మ్యాచ్‌లాడి 1724 పరుగులు చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్‌ చాలా అవసరం')

>
మరిన్ని వార్తలు