Asia Cup 2022: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. తొలి భారత ఆటగాడిగా!

1 Sep, 2022 13:56 IST|Sakshi

ఆసియాకప్‌ టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఆసియాకప్‌లో భాగంగా ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదిన సూర్య ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇంతకుముందు  ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో ఏ భారత ఆటగాడు కూడా  3 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టలేదు. 

తొలి భారత ఆటగాడిగా
కాగా ఈ మ్యాచ్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన ఆర్షద్‌ బౌలింగ్‌లో సూర్య ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అఖరి ఓవర్‌లో అత్యధిక పరుగులు  బాదిన తొలి టీమిండియా బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.

రోహిత్‌ రికార్డును సమం చేసిన సూర్య
ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన సూర్యకుమార్‌.. టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అదే విధంగా 22 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేసిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లలో అదరగొట్టిన సూర్య.. ఆసియాకప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. కాగా ఇంగ్లండ్‌పై తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా సాధించాడు.


చదవండి:
 Ind Vs HK: 'నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్‌'
             Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా!

మరిన్ని వార్తలు