Suryakumar: ఒకే స్టైల్‌లో రెండు స్టన్నింగ్‌ క్యాచ్‌లు.. 'స్కై' అని ఊరికే అనలేదు

2 Feb, 2023 09:02 IST|Sakshi

టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ముగిసిన మూడో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నయా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో రెండు క్యాచ్‌లు హైలైట్‌ గా నిలిచాయి. ఇందులో విశేషమేమిటంటే సూర్య తీసుకున్న రెండు క్యాచ్‌లు ఒకే స్టైల్‌లో ఉండడం.  ఈ రెండు క్యాచ్‌లు పక్కపక్కనబెట్టి చూస్తే రిప్లే చూసినట్లుగా అనిపించడం ఖాయం.

అందుకే అతను రెండు క్యాచ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సూర్యను అందరూ ముద్దుగా ''స్కై(SKY)'' పిలుచుకుంటారు. అతను గాల్లోకి ఎగిరి రెండు క్యాచ్‌లు పట్టడం చూసిన అభిమానులు.. నిన్ను ''స్కై(SKY)'' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపించుకున్నావ్‌'' అంటూ కామెంట్‌ చేశారు.  ఇక సూర్యకుమార్‌ మ్యాచ్‌లో 13 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.

విషయంలోకి వెళితే.. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన తొలి ఓవర్లోనే హార్దిక్‌ పాండ్యా షాక్‌ ఇచ్చాడు. ఓవర్‌ ఐదో బంతిని ఫిన్‌ అలెన్‌ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ దిశగా ఆడాడు. స్లిప్‌లో ఉన్న సూర్యకుమార్‌ అమాంతం గాల్లోకి ఎగిరి రెండు చేతులతో క్యాచ్‌ను అందుకున్నాడు. అలా ఫిన్‌ అలెన్‌ మూడు పరుగులకు పెవిలియన్‌ బాట పట్టాడు.  కట్‌చేస్తే ఇన్నింగ్స్‌ మూడు ఓవర్లో హార్దిక్‌ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్‌ నాలుగో బంతిని పాండ్యా మళ్లీ ఆఫ్‌సైడ్‌ దిశగా వేశాడు. ఈసారి గ్లెన్‌ పిలిప్స్‌ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ షాట్‌ ఆడాడు. స్లిప్‌లో ఉన్న సూర్య డైవ్‌ చేస్తూ క్యాచ్‌ తీసుకున్నాడు.ఇంకేముంది మళ్లీ అదే సీన్‌ రిపీట్‌. మొదటి క్యాచ్‌ను కాపీ కొట్టాడా అన్న తరహాలో ఆ క్యాచ్‌ ఉంటుంది.

ఇక ముచ్చటగా మూడోసారి కూడా మరో అద్భుత క్యాచ్‌తో మెరిశాడు సూర్య. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో శివమ్‌ మావి వేసిన మూడో బంతిని మిచెల్‌ సాంట్నర్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఉన్న సూర్య గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్‌ను తాకకుండా బ్యాలెన్స్‌ చేసుకుంటూ క్యాచ్‌ను తీసుకోవడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి స్కై అన్న పేరును సూర్యకుమార్‌ సార్థకం చేసుకున్నాడు.

చదవండి: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్‌ చేశారా

మరిన్ని వార్తలు