హిట్‌మాన్‌ను ఇంతలా అవమానిస్తారా.. స్విగ్గీపై ఫ్యాన్స్‌ ఫైర్‌

15 Apr, 2021 12:19 IST|Sakshi

ముంబై: టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులు ఆన్‌లైన్‌ ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీపై నిప్పులు చెరుగుతున్నారు. భారత క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, లక్షలాది మంది యువకులకు ఆరాధ్య క్రికెటర్‌ అయిన హిట్‌మాన్‌ను ఇంతలా అవమానిస్తారా? అని మండిపడుతున్నారు. ‘‘ఈ అహంకారపూరిత ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదు. మీకు తగిన శాస్తి చేస్తాం. ఇకపై మేము ఇలాంటి చెత్త ప్లాట్‌ఫాం నుంచి ఫుడ్‌ఆర్డర్‌ చేయబోం’’ అంటూ  #BoycottSwiggy హాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో దిగివచ్చిన స్విగ్గీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని రోహిత్‌  శర్మ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పింది. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్‌ సేన కోల్‌కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌కు ముందు రోహిత్‌ను ఉద్దేశించి స్విగ్గీ ఓ ట్వీట్‌ చేసింది.  హిట్‌మాన్‌ వడాపావ్‌ కోసం పరిగెత్తుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఇందుకు.. ‘‘తనను ద్వేషించే వాళ్లు దీనిని ఫొటోషాప్‌ చేసిందిగా చెబుతారు’’అంటూ క్యాప్షన్‌ జతచేసింది. దీంతో రోహిత్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తికొచ్చింది. వెంటనే బాయ్‌కాట్‌ స్విగ్గీ అంటూ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. కాగా, ఫిట్‌నెస్‌ విషయంలో రోహిత్‌ శర్మ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. 

‘‘తనకు ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యం’’ అంటూ కొంతమంది కామెంట్‌ చేయడం.. ఇప్పుడు స్విగ్గీ కూడా అదే తరహా ఫొటో షేర్‌ చేయడంతో అభిమానులు ఇలా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. ‘‘హిట్‌మాన్‌ అభిమానులకు ఓ ప్రత్యేక సందేశం. సరదాగా ఓ ఫ్యాన్‌ షేర్‌ చేసిన ట్వీట్‌ను మేం రీపోస్ట్‌ చేశాం. ఆ ఫొటో మేం సృష్టించింది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మేం ఎల్లప్పుడూ పల్టన్‌తోనే ఉంటాం’’ అని స్విగ్గీ ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు