Big Bash League: బిగ్‌బాష్‌ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్‌

16 Dec, 2022 18:18 IST|Sakshi
అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బౌలర్‌ హెన్రీ థోర్టన్‌(2.5-1-3-5)

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో పెను సంచలనం నమోదైంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ 15 పరుగులకే ఆలౌటై టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బౌలర్‌ హెన్రీ థోర్టన్‌ కెరీర్‌ బెస్ట్‌ స్పెల్‌(2.5-1-3-5) నమోదు చేశాడు. అంతేకాదు పవర్‌ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగియకుండానే ఆలౌట్‌ అయిన సిడ్నీ థండర్స్‌.. టి20 చరిత్రలోనే తొలి జట్టుగా మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. కొలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌ 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్‌ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్‌ సందు, డేనియల్‌ సామ్స్‌, బ్రెండన్‌ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ కేవలం 5.5 ఓవర్లు మాత్రమే ఆడి 15 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్‌ హేల్స్‌, రిలీ రొసౌ, డేనియల్‌ సామ్స్‌ జాసన్‌ సంగా లాంటి టి20 స్టార్స్‌ ఉన్న జట్టు ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. హెన్రీ థోర్టన్‌, వెస్‌ అగర్‌లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీయడంతో సిడ్నీ థండర్స్‌ కోలుకోలేకపోయింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

టి20 క్రికెట్‌ చరిత్రలో సీనియర్‌ విభాగంలో సిడ్నీ థండర్స్‌దే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకముందు చెక్‌ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా సిడ్నీ థండర్స్‌ ఆ రికార్డును బద్దలు కొట్టిన అత్యంత చెత్త టీమ్‌గా చరిత్ర సృష్టించింది.

చదవండి: రోహిత్‌ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా?

FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్‌.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!

మరిన్ని వార్తలు