7 వేదికలు... 38 జట్లు... 102 మ్యాచ్‌లు

10 Jan, 2021 05:57 IST|Sakshi

నేటి నుంచి దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

ఐపీఎల్‌ వేలం నేపథ్యంలో యువ ఆటగాళ్లకు కీలకం

శ్రీశాంత్‌ పునరాగమనం

ఆంధ్ర, హైదరాబాద్‌ జట్ల సత్తాకు పరీక్ష

ముంబై: ఎట్టకేలకు భారత దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి దేశంలోని ఆరు నగరాల్లో (నాకౌట్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో) దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జరగనుంది. కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్‌’ వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్‌–2021 వేలం ఉండటం... ఈ ఏడాదే స్వదేశంలో టి20 ప్రపంచకప్‌ జరగనుండటంతో... ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశం కల్పించనుంది.

► స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొని... నిషేధం గడువు పూర్తి కావడంతో భారత మాజీ బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ ఈ టోర్నీతో దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నాడు. కర్ణాటక జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో పోటీపడనుంది. ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ముంబై ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సూర్యకుమార్‌ ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.  

► గాయం నుంచి కోలుకున్న ఇషాంత్‌ శర్మ ఢిల్లీ తరఫున, గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న సురేశ్‌ రైనా ఉత్తరప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ తొలిసారి ముంబై సీనియర్‌ జట్టులో చోటు సంపాదించాడు. అర్జున్‌ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ ఆడినా ఐపీఎల్‌ వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాడు.  

► గత రెండు సీజన్‌లలో విజేతగా నిలిచిన కర్ణాటక మూడోసారీ టైటిల్‌ గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆంధ్ర, హైదరాబాద్‌ జట్లకు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ టోర్నీ వేదికగా నిలువనుంది. ఆంధ్ర జట్టుకు అంబటి రాయుడు... హైదరాబాద్‌ జట్టుకు తన్మయ్‌ అగర్వాల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘డ్రా’ను పరిశీలిస్తే ఆంధ్ర, హైదరబాద్‌ జట్లు నాకౌట్‌కు చేరాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో అస్సాంతో హైదరాబాద్‌ తలపడుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఫార్మాట్‌ ఎలా ఉందంటే?
మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్‌ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్‌ గ్రూప్‌ ఉంది. జనవరి 19వ తేదీ వరకు లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఎనిమిది జట్లు నాకౌట్‌ దశకు అర్హత పొందుతాయి. ఆరు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు దక్కించుకుంటాయి. లీగ్‌ దశలో 95 మ్యాచ్‌లు, నాకౌట్‌ దశలో 7 మ్యాచ్‌లు కలిపి టోర్నీలో మొత్తం 102 మ్యాచ్‌లు జరగనున్నాయి.  

నాకౌట్‌ మ్యాచ్‌లు ఎక్కడంటే?
జనవరి 26 నుంచి నాకౌట్‌ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 26న రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌... 27న మరో రెండు క్వార్టర్‌ ఫైనల్స్‌ ఉంటాయి. 29న రెండు సెమీఫైనల్స్‌ జరుగుతాయి. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
కరోనా నేపథ్యంలో ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. లీగ్‌ దశ మ్యాచ్‌లు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. లీగ్‌ దశలో గ్రూప్‌ ‘ఇ’, ‘బి’ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో టీవీలోనూ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

దీపక్‌ హుడా అవుట్‌...
బరోడా జట్టు ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. బరోడా జట్టు కెప్టెన్‌ , భారత జట్టు సభ్యుడు కృనాల్‌ పాండ్యా గత రెండు రోజులుగా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని... ఇతర జట్ల ఆటగాళ్ల ముందు తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దీపక్‌ హుడా బరోడా క్రికెట్‌ సంఘానికి లేఖ రాశాడు.

జట్ల వివరాలు
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర.
వేదిక: బెంగళూరు

ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం.
వేదిక: కోల్‌కతా

ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్‌.
వేదిక: వడోదర

ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా.
వేదిక: ఇండోర్‌

ఎలైట్‌ గ్రూప్‌ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి.
వేదిక: ముంబై

ప్లేట్‌ గ్రూప్‌: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌.
వేదిక: చెన్నైడిఫెండింగ్‌ చాంపియన్‌ కర్ణాటక (ఫైల్‌)

మరిన్ని వార్తలు