T20 Blast 2023: గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..! 

4 Jun, 2023 19:46 IST|Sakshi

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ బ్యాటర్‌ తన వ్యక్తిగత మైలురాయి కోసం స్ట్రయిక్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి పరువు పోగొట్టుకున్నాడు. నాటింగ్హమ్‌షైర్‌తో నిన్న (జూన్‌ 4) జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ బ్యాటర్‌ సామ్‌ హెయిన్‌.. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్‌ జేక్‌ లింటాట్‌ను ఇబ్బంది పెట్టాడు. ఇంత చేసి అతనేమైనా సెంచరీ సాధించాడా అంటే.. అదీ లేదు.

వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నాటింగ్హమ్‌షైర్‌.. జో క్లార్క్‌ (53 బంతుల్లో 89; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కొలిన్‌ మున్రో (43 బంతుల్లో 87; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో సామ్‌ హెయిన్‌ (52 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తన జట్టును (వార్విక్‌షైర్‌) గెలిపించలేకపోయాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

సెంచరీ కోసం కింద పడిపోయిన సహచరుడిని లేపి పరిగెట్టించాడు.. అయినా..!
ఆఖరి ఓవర్‌ చివరి 3 బంతుల్లో 19 పరుగులు చేయల్సిన పరిస్థితి ఉండింది. జేక్‌ బాల్‌ వేసిన ఈ ఓవర్‌ నాలుగో బంతిని లింటాట్‌ సిక్సర్‌గా మలచడంతో ఈక్వేషన్‌ 2 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అప్పటికి నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న హెయిన్‌ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, వార్విక్‌షైర్‌ గెలిచే పరిస్థితి కూడా లేదు.

ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న లింటాట్‌ భారీ షాట్‌ ఆడబోయి క్రీజ్‌లోనే కింద పడిపోయాడు. అవతలి ఎండ్‌లో సెంచరీ కోసం పరితపిస్తున్న హెయిన్‌.. సహచరుడు కిందపడి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా, సగం క్రీజ్‌ వరకు వచ్చి అతన్ని పరుగు తీయాల్సిందిగా కోరాడు. దీంతో లింటాట్‌ హెయిన్‌ సెంచరీ కోసం పడుతూ లేస్తూ పరుగు పూర్తి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు.

అయితే ఈ లోపే ఫీల్డర్‌ నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌ వైపు బంతి విసరడం, బౌలర్‌ ఆ బంతితో లింటాట్‌ను రనౌట్‌ చేయడం జరిగిపోయాయి. ఇంత జరిగికా కూడా సెంచరీ కోసం ఆఖరి బంతిని ఎదుర్కొన్న హెయిన్‌ అది సాధించాడా అంటే.. అది లేదు. 96 పరుగుల వద్ద ఉండిన హెయిన్‌ ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి ఉంటే, తన జట్టు గెలవకపోయినా అతను సెంచరీ అయినా చేసే వాడు.

అయితే అతను సింగిల్ మాత్రమే తీయడంతో 97 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం తంతు చూసి నెటిజన్లు హెయిన్‌ను తిట్టిపోస్తున్నారు. స్వార్ధపరుడని, గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం సహచరుడిని ఇబ్బందిపెట్టి పరువు పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.

మరిన్ని వార్తలు