ఐపీఎల్‌ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు

28 Jun, 2021 20:38 IST|Sakshi

ఆంటిగ్వా: పొట్టి ఫార్మాట్‌పై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌ అసలు క్రికెట్టే కాదని, అందుకే ఆ ఫార్మట్‌లో జరిగే ఐపీఎల్‌ తదితర లీగ్‌ల్లో కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నాడు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతానని, తాను ఐపీఎల్‌ను క్రికెట్‌గా పరిగణించనని, అందుకే కామెంటరీ చెప్పడం లేదని వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రస్తుత విండీస్‌ క్రికెట్‌ దుస్థితిపై ఆయన స్పందించాడు. టీ20ల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో తమ దేశం రాణించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు పొట్టి ఫార్మాట్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆ గెలుపు అసలు గెలుపే కాదని, ఈ టోర్నీలు నెగ్గడం విండీస్‌ క్రికెట్‌కు పునరుజ్జీవం కాదని అభిప్రాయపడ్డాడు. 

విండీస్ క్రికెటర్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం మానేసి, డబ్బు కోసం ఐపీఎల్‌ లాంటి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ల బాట పట్టారని ఆయన వాపోయాడు. విండీస్‌ లాంటి పేద దేశం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డులలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేవని, అందుకే తమ ఆటగాళ్లు ఆ దేశాల్లో జరిగే టీ20 క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నాడు. వేతన వివాదాలపై తమ దేశ క్రికెట్‌ బోర్డు, ఆటగాళ్ల మధ్య అనేక వివాదాలున్నాయని, ఇలాంటి పరిస్థితులుంటే ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరని వ్యాఖ్యానించాడు. క్రికెటర్లను నిందించడం తన ఉద్దేశం కాదని, డబ్బులు ఎర వేసి ఆటగాళ్లను లోబర్చుకుంటున్న నిర్వాహకులను మాత్రమే తాను విమర్శిస్తున్నాని పేర్కొన్నాడు. 

తమ దేశ స్టార్‌ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌కు చాలా సేవలు చేయాల్సి ఉందని, కానీ వారికి అవేవీ పట్టడం లేదని గేల్‌, రసెల్‌, బ్రేవో, పొలార్డ్‌, సునీల్‌ నరైన్‌ లాంటి క్రికెటర్లనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో విండీస్‌ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుండవచ్చని, అయితే అది క్రికెట్టే కాదు.. అసలు గెలుపే కాదని తెలిపాడు. కాగా, మైఖేల్‌ హోల్డింగ్‌ ఇటీవలే జాత్యహంకార అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక‌వేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే.. అస‌లు బ‌తికి ఉండేవాడినే కాదని, అదృష్టవశాత్తు తాను అక్కడ పెరగలేదని, లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే చనిపోయేవాడినని అన్నాడు. 1979లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. మొత్తంగా 391 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..?
 

మరిన్ని వార్తలు