Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోం కదా.. ఇప్పుడు..

4 Nov, 2021 12:57 IST|Sakshi
PC: ICC

Rohit Sharma- We have not become bad players overnight after two bad games: ‘‘గత రెండు మ్యాచ్‌లలో ఇలా జరుగలేదు. అయినంత మాత్రాన రాత్రి రాత్రే మేము చెత్త ఆటగాళ్లుగా మారలేదు కదా. రెండు మ్యాచ్‌లు సరిగా ఆడనంత మాత్రాన ఆటగాళ్లంతా పనికిరారు అని చెప్పలేం’’ అని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. పరాజయాల నుంచి తేరుకుని విజయం సాధించడం గొప్ప విషయమని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అదే చేశామని చెప్పుకొచ్చాడు. 

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో వరుస పరాజయాల తర్వాత కోహ్లి సేన.. ఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 66 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. గత రెండు మ్యాచ్‌లలో (గోల్డెన్‌ డక్‌, 14 పరుగులు) పూర్తిగా నిరాశపరిచిన రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి సత్తా చాటాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... ‘‘ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. మాది గొప్ప జట్టు. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ వంటి జట్లతో ఏదో ఒక రోజున ఓడినంత మాత్రాన తక్కువ చేయకూడదు. మాదైన రోజున చెలరేగి ఆడితే ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది’’ అని పేర్కొన్నాడు. 

ఇక సహ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(69 పరుగులు) చక్కగా బ్యాటింగ్‌ చేశాడన్న హిట్‌మ్యాన్‌... తామిద్దరం కలిసి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయడం కలిసి వచ్చిందన్నాడు. తొలుత ఫీల్డింగ్‌ చేయాల్సి వస్తుందని భావించామని, అయితే బ్యాటింగ్‌ చేసినా భారీ స్కోరు చేయడం సంతోషమన్నాడు. అయితే, తన సహజశైలికి భిన్నంగా ముందుగా క్రీజులో నిలదొక్కుకున్న తర్వాతే షాట్లకు యత్నించానన్న రోహిత్‌ శర్మ.. అఫ్గన్‌ ముందు భారీ లక్ష్యం ఉంచి ఒత్తిడి పెంచగలిగామని పేర్కొన్నాడు.

స్కోర్లు:
ఇండియా- 210/2 (20)
అఫ్గనిస్తాన్‌- 144/7 (20)

చదవండి: T20 WC 2021: సెమీస్‌ చేరడం కష్టమే.. కానీ అదొక్కటే దారి

మరిన్ని వార్తలు