T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో నుంచి వెళ్లిపోవాలన్న హోస్ట్‌

27 Oct, 2021 15:31 IST|Sakshi

Shoaib Akhtar Insulted On Live Television Show: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 26న జరిగిన మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ఓ లైవ్‌ షోలో పాక్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. పీటీవీ నిర్వహించిన ఆ లైవ్‌ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్‌ డాక్టర్‌ నౌమాన్‌ నియాజ్‌ అక్తర్‌ను లైవ్‌ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. మ్యాచ్‌ విశ్లేషణలో భాగంగా అక్తర్‌ పాక్‌ బౌలర్లు హరీస్‌ రౌఫ్‌, షాహిన్‌ అఫ్రిదిలపై ప్రశంసలు కురిపిస్తుండగా, నౌమన్ అభ్యంతరం చెప్పాడు. 

అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు. ఇందుకు నొచ్చుకున్న అక్తర్‌.. ‘మీరు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్‌ కాదని బదులిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన నౌమన్‌.. 'అతి తెలివిగా మాట్లాడితే సహించేది లేదు.. షో నుంచి వెళ్లిపోండి’ అంటూ లైవ్‌లో ఫైర్‌ అయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్‌.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్‌ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో అక్తర్‌తో పాటు వివ్‌ రిచర్డ్స్‌, డేవిడ్‌ గోవర్‌, రషీద్‌ లతీఫ్‌, ఉమర్‌ గుల్‌, ఆకిబ్‌ జావిద్‌, పాక్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సనా మీర్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.  

కాగా, సదరు విషయంపై అక్తర్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. టీవీల్లో మిలియన్ల మంది చూస్తుండగా నౌమన్‌ తనతో దురుసుగా ప్రవర్తించాడని, ఇది తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. ఇదంతా జరిగినప్పటికీ.. నౌమన్‌ తనను క్షమాపణలు కోరతాడని ఆశించానని, కానీ అందుకు అతను సుముఖంగా లేకపోవడం విచారకరమని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ నాలుగు వికెట్లతో చెలరేగి కివీస్‌ పతనాన్ని శాశించాడు. అంతకుముందు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సైతం పాక్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 
చదవండి: 'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్

Poll
Loading...
మరిన్ని వార్తలు