Virat Kohli- Rohit Sharma: కోహ్లిపై రోహిత్‌, అశ్విన్‌ ప్రశంసల వర్షం; అస్సలు ఊహించలేదన్న విరాట్‌

3 Nov, 2021 15:35 IST|Sakshi
రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి(PC: ICC)

T20 World Cup 2021: Rohit Sharma Praises Virat Kohli: ‘‘విజయం కోసం తను పరితపించే విధానం అమోఘం. అనిశ్చితికి తావు లేకుండా నిలకడగా ముందుకు సాగుతూ గెలుపును అందిపుచ్చుకోవడం అంత సులభమేమీ కాదు.  కానీ తను(కోహ్లి) మాత్రం ఆ పనిని ఎంతో చక్కగా నెరవేరుస్తాడు. 2008లో తను వచ్చాడు.. అప్పటి నుంచి నేటి దాకా క్రికెటర్‌గా ఎదిగిన తీరు అద్భుతం’’ అంటూ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... సారథి విరాట్‌ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 

అదే విధంగా... ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తను ఈ స్థాయికి చేరుకున్నాడని కితాబిచ్చాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు కోహ్లి చేసిన ప్రతీ ప్రయత్నాన్ని తాను కళ్లారా చూసినట్లు పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి టైటిల్‌ గెలవాలన్న ఆశయంతో టీమిండియా బరిలోకి దిగింది. అయితే.. వరుస పరాజయాలు వెక్కిరించడంతో.. మిగిలిన మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించడం సహా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో బుధవారం అబుదాబి వేదికగా అఫ్గనిస్తాన్‌తో కోహ్లి సేన తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక అనుకూల ఫలితం రాకపోతే.. ఈ టోర్నీలో చేదు అనుభవాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేసింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా కోహ్లికి ఇదే ఆఖరి టోర్నీ కావడంతో సహచర ఆటగాళ్లు అతడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పంచుకుంది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా సహా కోహ్లి సైతం ఈ వీడియోలో మాట్లాడటం చూడవచ్చు. అంతేగాకుండా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌, ఆర్సీబీ ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కూడా మాట్లాడాడు. ఇతడు టీమిండియాను సెమీస్‌కు చేర్చగలడా అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను ఐసీసీ షేర్‌ చేసింది. 

ఇంతదూరం వస్తానని ఊహించలేదు: కోహ్లి
‘‘13 ఏళ్లు... ఇంతదూరం వస్తానని అస్సలు ఊహించలేదు. అద్భుతమైన క్షణాలకు.. అత్యద్భుతమైన జ్ఞాపకాలకు ఈ ప్రయాణం సాక్ష్యం. భారత్‌కు ఆడటం గర్వకారణం. నా కెరీర్‌ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా నేను చాలా సంతోషంగా ఉన్నా’’ అని కోహ్లి వ్యాక్యానించాడు.

ఇక అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అద్బుతమైన బ్యాట్స్‌మెన్‌. టీ20.. వన్డే... టెస్టు.. ఇలా ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో తెలిసిన ఆటగాళ్లలో కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అలా అని ప్రతీ ఫార్మాట్‌కు తనను తాను మార్చుకోడు. అన్ని ఫార్మాట్లకు ఒకే గేమ్‌ ప్లాన్‌తో ముందుకు వెళ్లి విజయవంతమవడం తనకే చెల్లింది’’ అని కోహ్లిని ప్రశంసించాడు. 

చదవండి: Harbhajan Singh: గత రికార్డులు శుద్ధ దండుగ.. అఫ్గన్‌ను తేలికగా తీసుకోవద్దు!

మరిన్ని వార్తలు