Virat Kohli: అందరికీ థాంక్స్‌.. ఆరోజే గనుక వస్తే క్రికెట్‌ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం

8 Nov, 2021 23:20 IST|Sakshi
Virat Kohli(PC: ICC)

కెప్టెన్‌గా చివరి టీ20 ఆడేసిన కోహ్లి!

కప్‌ గెలవాలన్న కోరిక తీరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమణ

ఇకపై బ్యాటర్‌గా టీ20 జట్టులో కొనసాగనున్న కోహ్లి

అందరికీ ధన్యవాదాలు అంటూ భావోద్వేగం

T20 WC 2021 Virat Kohli Comments After Playing His Last T20 Match As Captain: ‘‘చాలా రిలీఫ్‌గా ఫీలవుతున్నా. కెప్టెన్‌గా ఉండటం నిజంగా గొప్ప గౌరవం. అయితే, పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. దాదాపు గత ఆరేడేళ్లుగా అధిక పనిభారం, ఒత్తిడి ఉంది. అయినా.. మా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ టోర్నీలో మాకు అనుకున్న ఫలితాలు రాలేదని తెలుసు. కానీ.. బాగానే ఆడాము అనుకుంటున్నాం. 

టీ20 క్రికెట్‌ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో మేం ఇదే మిస్సయ్యాం. ఇది వరకు చెప్పినట్లుగానే.. ఆ మ్యాచ్‌లలో మేము తెగించి ఆడలేకపోయాం. అది నిజంగా కఠిన సమయం. రవి భాయ్‌... సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా వారు గొప్పగా పనిచేస్తున్నారు.

ఆటగాళ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కృషి చేశారు. ఇంకో మాట.. ఇకపై కూడా మునుపటి దూకుడు కొనసాగుతుంది. ఆ దూకుడే గనుక చూపనినాడు నేను క్రికెట్‌ ఆడటం మానేస్తాను. కెప్టెన్‌ కాకముందు కూడా జట్టు విజయాలలో నా వంతు పాత్ర పోషించాను. అలాగే ముందుకు సాగుతాను’’ అంటూ నమీబియాపై టీమిండియా విజయం అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మేరకు ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.

భారత జట్టు టీ20 సారథిగా తనకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్‌లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై పూర్తిస్థాయిలో బ్యాటర్‌గా తన సేవలు అందిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా టీమిండియా నవంబరు 8న తమ చివరి మ్యాచ్‌ ఆడింది.

టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగిన కోహ్లి సేన.. కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా మరోసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోర్లు:
నమీబియా- 132/8 (20)
ఇండియా- 136/1 (15.2)

చదవండి: T20 World Cup 2021: టీమిండియా నిష్క్రమణపై పాక్‌ క్రికెట్‌ వ్యంగ్యాస్త్రాలు.. కౌంటరిచ్చిన వసీం జాఫర్

Poll
Loading...
మరిన్ని వార్తలు