T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్‌ సెమీస్‌ చేరడం ఖాయం.. మరి అఫ్గన్‌ గెలిచినా

6 Nov, 2021 13:15 IST|Sakshi

India & New Zealand To Reach Semis All Possible Scenarios: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ గ్రూపు-2లో సెమీ ఫైనల్‌ బెర్తు కోసం టీమిండియా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి పాకిస్తాన్‌ నాలుగింట నాలుగు విజయాలతో సెమీస్‌ చేరుకోగా.. ఈ మూడు జట్లు మాత్రం ఇతర జట్ల గెలుపోటములు, రన్‌రేటుపై ఆధారపడి ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కివీస్‌ జట్టు మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానం(6 పాయింట్లు)లో నిలిచింది. 

ఇక భారత్‌, అఫ్గనిస్తాన్‌ చెరో రెండు విజయాలతో నాలుగేసి పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. అయితే, ఈ రెండు జట్ల పోలిస్తే రన్‌రేటు పరంగా కివీస్‌ కాస్త వెనుకబడి ఉన్నా.. అఫ్గన్‌తో నవంబరు 7 నాటి మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది.

మరి టీమిండియా పరిస్థితి ఏంటి?
పాకిస్తాన్‌తో 10 వికెట్లు, న్యూజిలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాల తర్వాత అఫ్గనిస్తాన్‌తో భారీ విజయం సాధించింది కోహ్లి సేన. 66 పరుగులతో తేడాతో గెలుపొంది.. నెట్‌ రన్‌రేటును (-1.609 నుంచి +0.073) గణనీయంగా మెరుగు పరచుకుంది. 

ఇక స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత 85 పరుగులకే వారిని ఆలౌట్‌ చేసి 6.3 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించడం ద్వారా మరో ఘన విజయం అందుకుంది. దీంతో.. టీమిండియా రన్‌రేటు భారీగా(+1.619) పెరిగింది. అఫ్గనిస్తాన్‌ కంటే మెరుగైన స్థానంలో నిలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

ఇలా వరుసగా భారీ విజయాలతో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న టీమిండియా.. తదుపరి నవంబరు 8న... టోర్నీకి మొదటిసారిగా అర్హత సాధించిన పసికూన నమీబియాతో మ్యాచ్‌ ఆడనుంది. స్కాట్లాండ్‌పై మాదిరిగానే అతిపెద్ద విజయం నమోదు చేయగలిగితే సెమీస్‌కు వెళ్లడం అంత కష్టమేమీ కాదు. అయితే, అదే సమయంలో న్యూజిలాండ్‌ను అఫ్గనిస్తాన్‌ ఓడించాలి. అలా జరిగితేనే కోహ్లి సేనకు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 

ఒక్క అడుగు దూరంలో కివీస్‌
మరోవైపు... నవంబరు 5న పసికూన నమీబియాను న్యూజిలాండ్‌ భారీ తేడాతో ఓడించినప్పటికీ.. టాపార్డర్‌ నిరాశపరచడం ఆ జట్టుకు కాస్త ఆందోళనకరంగా పరిణమించింది. మిడిలార్డర్‌ గనుక రాణించి ఉండకపోయినా.. బౌల్ట్, సౌతీ నమీబియాను దెబ్బతీయడంలో విఫలమైనా ఫలితం మరోలా ఉండేది. బహుశా 52 పరుగులతో విజయం సాధించలేకపోయేదేమో!. ఇక న్యూజిలాండ్‌ రన్‌రేటు ప్రస్తుతం +1.277. అయితే సెమీస్‌ చేరాలంటే మాత్రం అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే చాలు. 

మరి అఫ్గనిస్తాన్‌ సెమీస్‌కు వెళ్లాలంటే..!
ఈసారి సూపర్‌-12 రౌండ్‌కు నేరుగా అర్హత సాధించిన అఫ్గనిస్తాన్‌.. వరుస భారీ విజయాలతో పాటు పాకిస్తాన్‌ను ఓడించినంత పనిచేసింది. తద్వారా తమను పసికూనలుగా భావించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. టీమిండియా చేతిలో ఓడినప్పటికీ.. న్యూజిలాండ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ కివీస్‌పై గనుక నబీ బృందం భారీ విజయం సాధించినా.. సెమీస్‌ చేరలేదు. 

అద్భుతాలు జరిగి కోహ్లి సేనకు నమీబియా చేతిలో భంగపాటు కలిగితే తప్ప అఫ్గన్‌కు ఎటువంటి అవకాశం లేదు. అయితే, అది అసాధ్యం. కాబట్టి... న్యూజిలాండ్‌ను ఓడించి మరో ఆసియా దేశాన్ని సెమీస్‌కు పంపుతుందో..! లేదంటే కివీస్‌ చేతిలో ఓడి.. తమతో పాటు టీమిండియాను టోర్నీ నుంచి బయటకు తీసుకువెళ్తుందో!.. తెలియాలంటే నవంబరు 7 నాటి ఫలితం వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

ఈ క్రమంలో టీమిండియా సెమీస్‌ అవకాశాలు అఫ్గనిస్తాన్‌ గెలుపుపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో భారత అభిమానులు నబీ బృందానికి మద్దతుగా నిలుస్తున్నారు. అన్నీ సజావుగా సాగి కోహ్లి సేన గనుక సెమీస్‌కు వెళ్తే మరోసారి చాంపియన్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదని అభిమానులు ఆశ పడుతున్నారు.

చదవండి: Aus Vs WI And Eng Vs SA: ఆస్ట్రేలియా.. లేదంటే దక్షిణాఫ్రికా.. సెమీస్‌ బెర్త్‌ ఎవరిదో?.. అంతా ఇంగ్లండ్‌ దయ!

Poll
Loading...
మరిన్ని వార్తలు