T20 WC Aus Vs Afg Updates: ఆస్ట్రేలియా విజయం.. పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్‌

4 Nov, 2022 13:29 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు జరిగింది. సూపర్‌-12 గ్రూఫ్‌-1లో అఫ్గానిస్తాన్‌ ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరవడంతో విజయానికి దగ్గరగా వచ్చిన ఆఫ్గన్‌ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ 23 బంతుల్లో 48 పరుగులతో మెరవగా.. గుల్బదిన్‌ నయీబ్‌ 39, ఇబ్రహీం జర్దన్‌ 26, రహమనుల్లా గుర్బాజ్‌ 30 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా, జోష్‌ హాజిల్‌వుడ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. కేన్‌ రిచర్డ్‌సన్‌ ఒక వికెట్‌ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్‌ రేసులో ఉన్నప్పటికి నెట్‌రనరేట్‌ మాత్రం మైనస్‌లోనే ఉంది. దీంతో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాములు విజయం సాధించినా ఆసీస్‌ ఇంటిదారి పట్టాల్సిందే. ఒకవేళ ఇంగ్లండ్‌ ఓడిపోతే మాత్రం ఆసీస్‌ సెమీస్‌కు చేరుతుంది.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్తాన్‌
► 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ఇబ్రహీం జర్దన్‌(26), గుల్బదిన్‌ నయిబ్‌(39) నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో మాక్స్‌వెల్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌కు గుల్బదిన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆడమ్‌ జంపా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికే ఇబ్రహీం జర్దన్‌ కూడా క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత అదే ఓవర్‌ మూడో బంతికి నజీబుల్లా జర్దన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ధాటిగా ఆడుతున్న అఫ్గానిస్తాన్‌.. 13 ఓవర్లలో 102/2
► 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ ధాటిగా ఆడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసంది. ఇబ్రహీ జర్దన్‌ 24, గుల్బదిన్‌ నయీబ్‌ 39 పరుగులతో ఆడుతున్నారు.

10 ఓవర్లలో ఆఫ్గన్‌ స్కోరు ఎంతంటే?
► 10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. గుల్బదిన్‌ నయీబ్‌ 24, ఇబ్రహీం జర్దన్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఫ్గన్‌ విజయానికి 60 బంతుల్లో 97 పరుగులు కావాలి

వార్నర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన ఆఫ్గన్‌
► డేవిడ్‌ వార్నర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో 30 పరుగులు చేసిన రహమనుల్లా గుర్బాజ్‌ వెనుదిరగడంతో ఆఫ్గన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. గుల్బదిన్‌ నయీబ్‌ 7, ఇబ్రహీం జర్దన్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన అఫ్గనిస్తాన్‌
► 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఉస్మాన్‌ ఘనీ(2) కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

అఫ్గానిస్తాన్‌ టార్గెట్‌ 169..
►అఫ్గనిస్తాన్‌తో కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 32 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మార్ష్‌ 45, వార్నర్‌ 25, స్టొయినిస్‌ 25 పరుగులు చేయగలిగారు. 

ఇక అఫ్గన్‌ బౌలర్లలో ఫరూకీ రెండు, ముజీబ్‌ ఒకటి, నవీన్‌ ఉల్‌ హక్‌ అత్యధికంగా మూడు, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

రిచర్డ్‌సన్‌ రనౌట్‌
నవీన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ షాట్‌ బాదగా పరుగు పూర్తి చేసే క్రమంలో కేన్‌ రిచర్డ్‌సన్‌ రనౌట్‌ అయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 159/8

కమిన్స్‌ డకౌట్‌
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ప్యాట్‌ కమిన్స్‌ డకౌట్‌ అయ్యాడు. నవీన్‌ బౌలింగ్లో రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కమిన్స్‌ రూపంలో ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 

వేడ్‌ అవుట్‌
18వ ఓవర్‌ ఐదో బంతికి ఫరూకీ.. ఆసీస్‌ కెప్టెన్‌ వేడ్‌(6)ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది.

ఐదో వికెట్‌ డౌన్‌
16వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మాక్స్‌వెల్‌, వేడ్‌ క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు- 146/5.

మార్ష్‌ అవుట్‌
జోరు మీదున్న మార్ష్‌ను ముజీబ్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 11 ఓవర్లలో స్కోరు 88/4. స్టొయినిస్‌, మాక్స్‌వెల్‌ క్రీజులో ఉన్నారు.

అర్ధ శతకానికి చేరువలో మార్ష్‌
29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 45 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. 10 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 83/3

8 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 64-3
మిచెల్‌ మార్ష్‌ 28, మార్కస్‌ స్టొయినిస్‌ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

పవర్‌ ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు ఎంతంటే! 
ఫజల్‌హక్‌ ఫారూకీ అఫ్గనిస్తాన్‌కు శుభారంభం అందించాడు. మూడో ఓవర్‌ తొలి బంతికే గ్రీన్‌ను పెవిలియన్‌కు పంపి తొలి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆరో ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ను అవుట్‌ చేశాడు నవీన్‌ ఉల్‌ హక్‌. అంతేకాదు ఆఖరి బంతికి స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 54 పరుగులు చేసింది. 

ప్రపంచకప్‌-2022లో భాగంగా టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ జట్లు తొలిసారి ముఖాముఖి పోటీపడుతున్నాయి. సూపర్‌-12లో భాగంగా గ్రూప్‌-1లో ఉన్న ఇరు జట్లు శుక్రవారం మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుక సిద్ధమయ్యాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీస్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించి తీరాలి.

మరోవైపు ఈ మ్యాచ్‌ గెలిచినా అఫ్గన్‌కు పెద్దగా లాభం లేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌ ఆశలకు గండికొట్టే అవకాశం ఉంది. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయం కారణంగా దూరం కాగా.. మాథ్యూ వేడ్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

మూడు మార్పులు
టాస్‌ సందర్భంగా తాము మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వేడ్‌ వెల్లడించాడు. ఫించ్‌, టిమ్‌ డేవిడ్‌, మిచెల్‌ స్టార్క్‌.. స్థానాల్లో కామెరూన్‌ గ్రీన్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు.. అఫ్గనిస్తాన్‌ రెండు మార్పులతో మైదానంలో దిగింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ఫరీద్‌ అహ్మద్‌ స్థానాల్లో డార్విష్‌ రసౌలీ, నవీన్‌ ఉల్‌ హక్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.  కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు ఇవే:
అఫ్గనిస్తాన్‌:
రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), ఉస్మాన్ ఘనీ, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నైబ్, డారిష్‌ రసౌలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్‌), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ.

ఆస్ట్రేలియా:
కామెరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్‌ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్‌ దిగ్గజం.. అయితే!
T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్‌!

మరిన్ని వార్తలు