T20 WC 2022: అందుకే రసెల్‌ను ఎంపిక చేయలేదు.. కేవలం అలాంటి వాళ్లకే ఛాన్స్‌: విండీస్‌ చీఫ్‌ సెలక్టర్‌

15 Sep, 2022 12:54 IST|Sakshi
ఆండ్రీ రసెల్‌

T20 World Cup 2022 - West Indies Squad: టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌కు చోటు దక్కకపోవడంపై వెస్టిండీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ డెస్మాండ్‌ హేన్స్‌ స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌లో రసెల్‌ ప్రదర్శన గొప్పగా లేదని.. అందుకే అతడిని పక్కనపెట్టినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో విండీస్‌ క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. ఇందులో రసెల్‌కు చోటు దక్కలేదు. వెటరన్‌ పవర్‌ హిట్టర్‌ ఎవిన్‌ లూయిస్‌ మాత్రం చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు.

అందుకే అతడిని సెలక్ట్‌ చేయలేదు!
ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ డెస్మాండ్‌ హైన్స్‌ మాట్లాడుతూ.. రసెల్‌ను పక్కనపెట్టడానికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘ఈ ఏడాది ఆరంభంలో మేము ఆండ్రీ రసెల్‌తో సమావేశమయ్యాం. అతడి ఆట తీరు బాగా లేదు. గత కొన్నాళ్లుగా చూస్తున్నాం.

రసెల్‌ ప్రదర్శనతో మేము సంతృప్తి చెందలేదు. కాబట్టి రసెల్‌ను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాం. అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న ఆటగాడిని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో బాగా ఆడుతున్న క్రికెటర్‌ను ఎంపిక చేయాలని భావించాం’’ అని డెస్మాండ్‌ పేర్కొన్నాడు.

అలాంటి వాళ్లకు అవకాశం!
ఇక ఎవిన్‌ లూయిస్‌ గురించి చెబుతూ.. ‘‘విండీస్‌ అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ ఎవిన్‌ లూయిస్‌ వంటి ఆటగాడి అవసరం జట్టుకు ఉంది. జట్టు కోసం తాను కష్టపడతానని అతడు మాతో చెప్పాడు. అందుకే ఒక అవకాశం ఇవ్వాలని భావించాం.

అతడు మాతో మాట్లాడిన తీరు.. జట్టులో తన అవసరం ఏమిటో వివరించిన విధానం నచ్చింది.. ఇలా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఆటగాళ్లకు తప్పక అవకాశం ఇస్తాం’’ అని డెస్మాండ్‌ పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రసెల్‌ ఇంత వరకు విండీస్‌ తరఫున ఆడలేదు.

రసెల్‌ విఫలం!
ప్రస్తుతం కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2022లో ట్రింబాగో నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్‌.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. చెప్పుకోదగ్గ స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే..  విండీస్‌ క్రికెట్‌ హెడ్‌కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌.. డబ్బుపై మోజుతో కొందరు కేవలం ప్రైవేట్‌ లీగ్‌లలోనే ఎక్కువగా ఆడుతున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై స్పందించిన రసెల్‌.. కొంతమంది తనను కావాలనే బలిపశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు చీఫ్‌ సెలక్టర్‌ సైతం రసెల్‌ను ఉద్దేశించి అతడి ప్రదర్శన బాగా లేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా విండీస్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12కు క్వాలిఫై కాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫైయింగ్‌ దశలో స్కాట్లాండ్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌లతో నికోలస్‌ పూరన్‌ బృందం తలపడాల్సి ఉంది.

చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడు’!
ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్‌ 2022 కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు