WC 2022: ఓపెనర్‌గా పంత్‌, ఇషాన్‌.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే!

5 Aug, 2022 14:12 IST|Sakshi
రిషభ్‌ పంత్‌, సూర్యకుయార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌(PC: Ishan Kishan)

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు పంపాల్సిన జట్ల ఎంపిక విషయంలో ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు కసరత్తులు చేస్తున్నాయి. ఇక యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వేళ భారత జట్టు ఎంపిక.. సెలక్టర్లకు పెద్ద తలనొప్పిలా మారిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడీపై పెద్ద చర్చే నడుస్తోంది.

రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరం కావడంతో ఇటీవలి సిరీస్‌లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగారు. మరోవైపు.. రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌తో వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనింగ్‌ స్థానానికి పోటీలో ఉండనే ఉన్నారు. 

అతడే సరైనోడు!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌- రాహుల్‌ జోడీకి థర్డ్ ఛాయిస్‌ ఓపెనర్‌గా పృథ్వీ షా పేరును అతడు సూచించాడు. ప్రతిభ, అద్బుత నైపుణ్యాలు అతడి సొంతమని.. కాబట్టి అతడిని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.

ఈ మేరకు క్రిక్‌ట్రాకర్‌తో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘టీ20 వరల్డ్‌కప్‌నకు ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మకే నా మొదటి ప్రాధాన్యం. మూడో ఓపెనర్‌గా పృథ్వీ షా వంటి ప్రతిభ గల ఆటగాడు ఉంటే బెటర్‌. వైవిధ్యమైన ఆటతో ఆకట్టుకుంటాడు. ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. 70,80, 100 బాదకపోయినా.. శుభారంభం మాత్రం అందించగలడు’’ అని దీప్‌దాస్‌ గుప్తా చెప్పుకొచ్చాడు.

పాపం.. ఏడాది అవుతోంది!
స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఆటగాడు పృథ్వీ షా గతేడాది శ్రీలంక పర్యటనలో ఆఖరి సారిగా టీమిండియా తరఫున ఆడాడు. ఏడాది కాలంగా అతడికి ఏ సిరీస్‌లోనూ సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ టోర్నీలో ముంబైకి సారథిగా వ్యవహరించిన పృథ్వీ షా.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు.

ఇక ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా 10 మ్యాచ్‌ల్లో  283 పరుగులు చేశాడు. అయినప్పటికీ బీసీసీఐ నుంచి మాత్రం అతడు పిలుపు అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో దీప్‌దాస్‌ గుప్తా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తరచుగా ఓపెనర్లను మార్చడంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

రానున్న ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగానే ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపాడు.
చదవండి: SreeShankar Won Silver CWG 2022: మేజర్‌ సర్జరీ.. లాంగ్‌ జంప్‌ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్‌?

>
మరిన్ని వార్తలు