ఫామ్‌లో లేని పంత్‌.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడా?.. అదైతే కష్టం కానీ: ద్రవిడ్‌

20 Jun, 2022 15:30 IST|Sakshi
రిషభ్‌ పంత్‌, రాహుల్‌ ద్రవిడ్‌, దినేశ్‌ కార్తిక్‌

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్‌ పంత్‌ సాధించిన స్కోర్లు.. 29, 5, 6, 17, 1 నాటౌట్‌. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమం. వర్షం కారణంగా నిర్ణయాత్మక ఐదో టీ20 రద్దు కావడంతో ఫలితం తేలకుండానే సిరీస్‌ ముగిసింది. 

పంత్‌ విఫలం.. డీకే జోరు
ఇందులో కెప్టెన్‌గా సఫలమైనా బ్యాటర్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు పంత్‌. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌-2022 ఈవెంట్‌ సమీపిస్తున్న తరుణంలో పంత్‌ ఫామ్‌లేమి ఆందోళనకరంగా మారింది. 

పంత్‌ పరిస్థితి ఇలా ఉంటే.. వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ రోజురోజుకీ తన ఆటను మెరుగుపరచుకుంటూ.. జట్టును విజయతీరాలకు చేరుస్తూ టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. పంత్‌కు పోటీగా మారుతున్నాడు.

ఈ నేపథ్యంలో రానున్న ప్రపంచకప్‌ టోర్నీలో పంత్‌కు చోటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన తర్వాత మీడియాతో ద్రవిడ్‌ మాట్లాడాడు.

ఏదేమైనా పంత్‌ మాత్రం..
ఈ సందర్భంగా పంత్‌ గురించి స్పందిస్తూ.. ‘‘ఈ విషయాన్ని మరింత క్లిష్టంగా మార్చాలనుకోవడం లేదు. వ్యక్తిగతంగా తాను పరుగులు సాధించేందుకు ఇష్టపడతాడు. కానీ ఇలాంటి సందర్భాల్లో పెద్దగా ఆందోళన చెందడు. ఏదేమైనా రానున్న కొన్ని నెలల్లో జట్టులో అతడు కీలక పాత్ర పోషించనున్నాడు.

మా ప్రణాళికల్లో తన పేరు ఎప్పుడూ ఉంటుంది. నిజానికి మిడిల్‌ ఓవర్లలో కాస్త అటాకింగ్‌గా ఆడాల్సి ఉంటుంది. అంతేగానీ.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో ప్రదర్శనను బట్టి ఓ బ్యాటర్‌ ఫామ్‌ను అంచనా వేయడం కాస్త కష్టమే’’ అంటూ యువ బ్యాటర్‌కు ద్రవిడ్‌ మద్దతుగా నిలిచాడు. 

ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి.. కానీ
ఇక పంత్‌ను విమర్శిస్తున్న వాళ్లను ఉద్దేశించి.. ‘‘ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్‌ రేటు అమోఘం. ఐపీఎల్‌ ప్రదర్శనను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. అటాకింగ్‌ సమయంలో ఒక్కోసారి షాట్‌ సెలక్షన్‌ విషయంలో అంచనాలు తప్పుతాయి.

ఏదేమైనా ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌ మిడిలార్డర్‌ ఓవర్లో మాకెంతగానో అవసరం. తను ఎన్నోసార్లు జట్టును గెలిపించాడు’’ అని ద్రవిడ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కాగా ఐపీఎల్‌-2021 ద్వితీయార్థ భాగంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన రిషభ్‌ పంత్‌.. ఆ ఏడాది జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఇక తాజా ఎడిషన్‌లో 158కి పైగా స్ట్రైక్‌ రేటుతో 340 పరుగులు సాధించాడు.

చదవండి: Trolls On BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేల కోట్లు.. కానీ ఇదేం ఖర్మరా బాబూ!

మరిన్ని వార్తలు