T20 WC 2022: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది?

17 Oct, 2022 17:18 IST|Sakshi
టీమిండియా

ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్‌-2021లో కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా ఈసారి  ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. స్వదేశం, విదేశాల్లో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన రోహిత్‌ సేన.. టైటిల్‌ విజేతగా నిలవాలని భావిస్తోంది. అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సహా ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చహర్‌ ఇప్పటికే గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.

బుమ్రా లేడు కాబట్టే!
ఆసియా కప్‌-2022లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన ఫైనల్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2022కు బుమ్రా అందుబాటులో ఉంటాడని భావిస్తే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్‌ సమయంలోనే దూరమయ్యాడు. 

అయితే, ఇప్పుడు మరో ఆటగాడు కూడా జట్టుకు దూరమవుతాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా సోమవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌ వేదికగా వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది.

పంత్‌కు ఏమైంది?
ఈ సందర్భంగా భారత యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, స్టార్‌ ప్లేయర్‌ రిషభ్‌ పంత్‌ కుడి మోకాలికి కట్టుతో కనిపించాడు. మోకాలిపై ఐస్‌ప్యాక్‌తో డగౌట్‌లో కూర్చున్న అతడి ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్‌.. కంగారూ పడిపోతున్నారు. ఈ స్టార్‌ బ్యాటర్‌ గనుక జట్టుకు దూరమైతే జట్టుకు భారీ ఎదురుదెబ్బేనని కామెంట్లు చేస్తున్నారు.

ఊరికే రిలీఫ్‌ కోసమే!
అయితే, మరికొంత మంది మాత్రం ఊరికే రిలీఫ్‌ కోసమే ఐస్‌ప్యాక్‌ పెట్టుకున్నాడని, పంత్‌కు ఏమీ కాలేదని పేర్కొంటున్నారు. ఇంకొంత మందేమో.. పర్లేదు.. దినేశ్‌ కార్తిక్‌ ఉన్నాడుగా.. నో ప్రాబ్లమ్‌ అంటూ జట్టులో పంత్‌ స్థానాన్ని ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ పెద్దగా రాణించకపోతున్నప్పటికీ.. ఆసీస్‌ పిచ్‌లపై అతడికి ఉన్న రికార్డు దృష్ట్యా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

అసలు సిసలు మ్యాచ్‌ ఆనాడే
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. తదుపరి న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక పాకిస్తాన్‌తో అక్టోబరు 23 నాటి మ్యాచ్‌తో ఐసీసీ ఈవెంట్‌ ప్రయాణం ఆరంభించనుంది. మరోవైపు.. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్‌ షమీ వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

చదవండి: WI Vs SCO: మాకిది ఘోర పరాభవం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో: విండీస్‌ కెప్టెన్‌
కొట్టాలనే మూడ్‌ లేదు.. ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా సూర్యకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

A post shared by ICC (@icc)

Poll
Loading...
మరిన్ని వార్తలు