T20 WC 2022: సెమీస్‌కు చేరిన 4 జట్ల కెప్టెన్లు తుస్సుమనిపించారు.. అతనైతే మరీ దారుణం..!

8 Nov, 2022 17:48 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 తుది అంకానికి చేరింది. మరో మూడు మ్యాచ్‌లు జరిగితే టోర్నీ సమాప్తమవుతుంది. న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య సిడ్నీ వేదికగా రేపు (నవంబర్‌ 9) తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుండగా.. అడిలైడ్‌ వేదికగా ఎల్లుండి (నవంబర్‌ 10) భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు నవంబర్‌ 13న టైటిల్‌ కోసం పోరాడనున్నాయి. 

ఇదిలా ఉంటే, సూపర్‌-12 దశలో సెమీస్‌కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఆయా జట్లను తీవ్రంగా కలవరపెడుతుంది. జట్టును ముందుండి నడిపించే సారధులే వరుస వైఫల్యాల బాట పడుతుండటాన్ని సంబంధిత జట్ల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్లే విఫలమవుతుంటే, తమ జట్లు ఏరకంగా టైటిల్‌ సాధిస్తాయని వారు వాపోతున్నారు. కెప్టెన్‌ అనే వాడు ఒక మ్యాచ్‌లో కాకపోతే మరో మ్యాచ్‌లోనైనా రాణించి జట్లకు మార్గదర్శకంగా ఉంటే టైటిల్‌ సాధించవచ్చని భావిస్తున్నారు.

వరల్డ్‌కప్‌-2022లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్ల కెప్టెన్ల గణాంకాలకు పరిశీలిస్తే.. నలుగురిలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కాస్తో కూస్తో బెటర్‌ అనిపిస్తుంది. కేన్‌ మామ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్‌ 61గా ఉంది. విలియమ్సన్‌ తర్వత గుడ్డిలో మెల్లలా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ప్రదర్శన కాస్త మేలనిపిస్తుంది.

బట్లర్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో 73 అత్యధిక స్కోర్‌తో 119 పరుగులు సాధించాడు. మన హిట్‌మ్యాన్‌ విషయానికొస్తే.. రోహిత్‌ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 53 అత్యధిక స్కోర్‌తో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. నలుగురు కెప్టెన్లలో అత్యంత దారుణమైన ప్రదర్శన అంటే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌దేనని చెప్పాలి. బాబర్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 25 అత్యధిక స్కోర్‌తో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. 

సెమీస్‌కు చేరిన నాలుగు జట్లలో న్యూజిలాండ్‌, టీమిండియా మినహాయిస్తే, మిగిలిన రెండు జట్లలో ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఒకరో ఇ‍ద్దరో రాణించడంతో ఇంగ్లండ్‌.. అదృష్టం కలిసొచ్చి పాక్‌ సెమీస్‌కు చేరాయి. కివీస్‌, టీమిండియాల్లో మాత్రం బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి వారివారి జట్లను సెమీస్‌కు చేర్చారు. 
చదవండి: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు మరో బిగ్‌ షాక్‌..!

Poll
Loading...
మరిన్ని వార్తలు