T20 WC 2022: సంచలనాల వరల్డ్‌కప్‌లో బెస్ట్‌ మ్యాచెస్‌ ఇవే..!

7 Nov, 2022 18:54 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో ఇప్పటి దాకా (సూపర్‌-12 దశ) జరిగిన మ్యాచ్‌ల్లో ఉత్తమ మ్యాచ్‌ల జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్‌ 7) ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ ఉండగా.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రెండో ప్లేస్‌లో, ఆతర్వాత  ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌, పాకిస్తాన్‌-జింబాబ్వే, బంగ్లాదేశ్‌-జింబాబ్వే, ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్‌, ఇండియా-సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు వరుసగా 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి.

  • క్రికెట్‌ పసికూన నెదర్లాండ్స్‌.. తమ ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాకిచ్చి, ఆ జట్టు సెమీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో​ ఐసీసీ ఈ మ్యాచ్‌కు టాప్‌ రేటింగ్‌ ఇచ్చింది. 
  • నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు అసలుసిసలు పొట్టి క్రికెట్‌ మజాను అందించింది. కోహ్లి చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌కు రెండో స్థానం దక్కింది. 
  • క్వాలిఫయర్‌ దశలో వెస్టిండీస్‌ను ఖంగుతినిపించి సంచలనాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఐర్లాండ్‌.. సూపర్‌-12 స్టేజ్‌లో వరుణుడు సహకరించడంతో ఇంగ్లండ్‌కు షాకిచ్చి, ఐసీసీ బెస్ట్‌ మ్యాచెస్‌ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 
  • ఆఖరి బంతి వరకు హైడ్రామా నడిచిన జింబాబ్వే-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. పాక్‌పై సంచలన విజయం సాధించి, ఆ జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టింది. 
  • అనూహ్య మలుపుల మధ్య ఆఖరి బంతి వరకు సాగిన బంగ్లాదేశ్‌-జింబాబ్వే మ్యాచ్‌కు ఈ జాబితాలో ఐదో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తడబడ్డ జింబాబ్వే.. మరో సంచలన విజయం నమోదు చేసే అవకాశాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది.
  • ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌ ఆరో స్థానం దక్కించుకుంది. ఛేదనలో రషీద్‌ ఖాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ వెన్నులో వణుకు పుట్టించాడు. 
  • ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన భారత్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌కు ఏడో స్థానం లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. స్వల్ప లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌ వరకు కాపాడుకుని ప్రొటీస్‌ను భయపెట్టింది.
  • ఆసీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌ ఐసీసీ ఉత్తమ మ్యాచ్‌ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్‌ ఏకపక్షంగానే సాగినప్పటికీ.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందించింది. 

ఇవే కాక క్వాలిఫయర్‌ దశలో మరో రెండు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. నమీబియా.. శ్రీలంకకు షాకివ్వడం, స్కాట్లాండ్‌.. విండీస్‌ను మట్టికరిపించడం లాంటి సంచలనాలు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నమోదయ్యాయి. 

Poll
Loading...
మరిన్ని వార్తలు