T20 WC 2022 IND VS ENG: ఆందోళన కలిగిస్తున్న రోహిత్‌ శర్మ ఫామ్‌.. ఇకనైనా చెలరేగాలి..!

7 Nov, 2022 20:32 IST|Sakshi

Harbhajan Singh: వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌ ఫామ్‌ ప్రదర్శిస్తూ, గ్రూప్‌-2లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరిన టీమిండియా.. నవంబర్‌ 10న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో జట్టుగా అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియా.. ఇకపై నాకౌట్‌ దశలో విషమ పరీక్ష ఎదుర్కోనుంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌, ఫైనల్‌కు చేరితే న్యూజిలాండ్‌ లేదా పాకిస్తాన్‌ లాంటి పటిష్టమైన జట్లను టీమిండియా ఢీకొట్టాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో ఓ విషయం టీమిండియాను, అభిమానులకు తీవ్రంగా కలవరపెడుతుంది. అదే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌. గతకొంతకాలంగా అడపాదడపా ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌.. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఉసురూమనిపించాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో (4, 53, 15, 2, 15 పరుగులు) కేవలం ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే చేసి అటు అభిమానులను, ఇటు జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాడు.

ఇదే అంశాన్ని తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రస్తావించాడు. భజ్జీ.. రోహిత్‌ పేలవ ఫామ్‌పై ఘాటుగా స్పందించాడు. ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, గత రెండు మ్యాచ్‌లుగా కేఎల్‌ రాహుల్‌ రాణిస్తున్నారు కాబట్టి బ్యాటింగ్‌ విభాగంలో టీమిం‍డియాకు ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదని, ప్రతి మ్యాచ్‌లో వారు ఆదుకుంటారని ఆశించలేమని, ఇకనైనా హిట్‌మ్యాన్‌ ఫామ్‌లోకి రాకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు.

సెమీస్‌లో ఎదుర్కొనబోయే ప్రత్యర్ధితో అంత ఈజీ కాదని.. రోహిత్‌ చెలరేగితేనే వారిపై విజయం సాధించగలమని అలర్ట్‌ చేశాడు. ప్రస్తుతం రోహిత్‌ చాలా చెత్త ఫామ్‌లో ఉన్నాడని, సెమీస్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, దానిపై వర్కవుట్‌ చేయాలని సూచించాడు. రోహిత్‌ గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడని, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను తప్పక చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.  

కాగా, నవంబర్‌ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్‌ 13న ఫైనల్‌ జరుగుతుంది. 
 

>
Poll
Loading...
మరిన్ని వార్తలు