T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో పోరు.. టీమిండియాలో మూడు మార్పులు..?

25 Oct, 2022 21:05 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన హైఓల్టేజీ పోరులో ఘన విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా.. అక్టోబర్‌ 27న తమ తదుపరి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. చిన్న జట్టు కదా అని ఉదాసీనంగా వ్యవహరించకుండా ఈ మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. నెదర్లాండ్స్‌పై భారీ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసుకోవాలని టీమిండియా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే తదుపరి మ్యాచ్‌కు పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. 

అయితే, గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టులో రెండు, మూడు మార్పులు చేసే ఆస్కారం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన అక్షర్‌ పటేల్‌, అదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టిన హార్ధిక్‌ పాండ్యా, వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్థానాల్లో యుజ్వేంద్ర చహల్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌లను బరిలోకి దించే అవకాశం​ ఉందని వారు అంచనా వేస్తున్నారు.

అక్షర్‌ విఫలం కావడంతో చహల్‌ తుది జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉండగా.. మున్ముందు కీలకమైన మ్యాచ్‌ల దృష్ట్యా హార్ధిక్‌కు విశ్రాంతినిచ్చి దీపక్‌ హుడాను అడించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇక డీకే విషయానికొస్తే.. పాక్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో చేతులెత్తేసిన కార్తీక్‌ను నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశాలు ఉన్నప్పటికీ.. టాస్‌పై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంటే డీకే యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే మాత్రం పంత్‌కు అవకాశం రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు మార్పులు మినహా పాక్‌పై బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యాజమాన్యం యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది.  
చదవండి: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..!

Poll
Loading...
మరిన్ని వార్తలు